ఫ్లిప్‌కార్ట్‌ కో ఫౌండర్‌పై వరకట్న వేధింపుల కేసు

5 Mar, 2020 10:59 IST|Sakshi
సచిన్‌ బన్సాల్‌ దంపతులు (ఫైల్‌ ఫోటో)

సాక్షి, బెంగళూరు:  ఫ్లిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సాల్‌పై వరకట్నం వేదింపుల కేసు నమోదైంది. సచిన్‌ భార్య ప్రియా బన్సాల్‌ (35) బెంగళూరు కోరమంగళ పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.  ఆస్తులను సచిన్‌కు బదిలీ చేయడానికి నిరాకరించడంతో అతని తల్లిదండ్రులు, సోదరుడు తనను మానసికంగా, శారీరకంగా వేధించారనేది ప్రధాన ఆరోపణ. భర్త సచిన్ బన్సాల్, మామ సత్య ప్రకాష్ అగర్వాల్, అత్త కిరణ్ బన్సాల్, సచిన్‌ సోదరుడు నితిన్ బన్సాల్  పై ఆమె ఫిర్యాదు నమోదు చేశారు.

వృత్తిపరంగా దంత వైద్యురాలైన  ప్రియ అందించిన  సమాచారం ప్రకారం 2008లో ప్రియ, సచిన్‌ల వివాహమైంది. వివాహ సమాయంలో 50లక్షల  రూపాయలను ఖర్చు చేసివివాహం చేయడంతోపాటు కట్నంగా రూ. 11 లక్షలు కట్నంగా ఇచ్చారు. గత కొంతకాలంగా ఆస్తులను  తన పేరుతో మార్చాల్సిందిగా సచిన్‌ డిమాండ్‌ చేస్తున్నాడని, గత ఏడాది అక్టోబర్‌లో భర్త( సచిన్‌) తనపై శారీరకంగా దాడి చేశాడని,  డబ్బు డిమాండ్ చేశాడని  ప్రియ ఆరోపించారు. అలాగే ఢిల్లీ వెళ్లిన సందర్భంలో తన సోదరిపై లైంగిక వేధింపులకు పాల‍్పడ్డాడని కూడా ఫిబ్రవరి 28 న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అసలు వివాహానికి ముందే కట్నం కోసం తనను వేధించారని ప్రియ ఆరోపించారు.  దీంతో 498 ఎ (వరకట్న వేధింపులు), 34 (క్రిమినల్ ఉద్దేశం) వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నలుగురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 29న సచిన్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసు​కోగా దీనిపై నిర్ణయం గురువారం వెలువడనుందని సమాచారం. అయితే కొన్ని వారాల క్రితమే  అత్త కిరణ్‌ బన్సాల్‌ కోడలు ప్రియపై కేసు నమోదు చేసినట్టు కోర్టు రికార్డుల ద్వారా తెలుస్తోంది. 

కాగా 2018లో ప్రపంచ రీటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌  ప్లిప్‌కార్ట్‌లో మేజర్‌ వాటాను కొనుగోలు చేసింది.  దీంతో  ఫ్లిప్‌కార్ట్ నుంచి నిష్క్రమించిన సచిన్ బన్సాల్ తన వాటాను విక్రయించడం ద్వారా  ఒక బిలియన్‌ డాలర్లను సొంతం చేసుకున్నారు. అనంతరం 450 మిలియన్ డాలర్లు  పెట్టుబడులతో అంకిత్ అగర్వాల్‌తో కలిసి నవీ టెక్నాలజీస్ పేరుతో డిజిటల్ బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించాడు. దీంతోపాటు ఓలాలో 100 మిలియన్ల డాలర్లు పెట్టుబడులు సహా , ఎలక్ట్రిక్ స్కూటర్ స్టార్టప్ అథెర్‌, ఇన్‌షార్ట్స్‌, గ్రే ఆరెంజ్, యునా అకాడమీ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. మరోవైపు ఈ ఆరోపణలపై సచిల్‌ బన్సాల్‌  స్పందించాల్సి వుంది. 

మరిన్ని వార్తలు