వారికి ఉరిశిక్ష ఖరారు చేయండి

25 Sep, 2018 03:08 IST|Sakshi

‘జంట పేలుళ్ల’కేసు ఫైళ్లను హైకోర్టుకు పంపిన కింది కోర్టు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జంట పేలుళ్ల కేసులో దోషులు అనీక్‌ షఫీక్‌ సయీద్, మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిలకు తాము విధించిన ఉరిశిక్ష ఖరారు చేయాలంటూ కేసు ఫైళ్లను హైకోర్టుకు కింది కోర్టు నివేదించింది. ఫైళ్లను  పరిశీలించిన హైకోర్టు.. ఉరిశిక్ష ఖరారులో నిర్ణయం తీసుకునేందుకు వాటికి నంబర్లు కేటాయించి రెఫర్‌ ట్రయల్‌ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఉరిశిక్ష పడిన దోషుల వాదనలు వినేందుకు వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కెయిత్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరికీ జైలర్‌ ద్వారా నోటీసులు అందజేయాలని ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. జంట పేలుళ్ల కేసులో అనీక్, ఇస్మాయిల్‌ చౌదరిలకు ఉరిశిక్ష విధిస్తూ రెండో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టు  ఈ నెల 10న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దోషులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్‌ అంజూమ్‌ ఎహసాన్‌కు జీవిత ఖైదు విధించగా మరో ఇద్దరు నిందితులు సాదిక్‌ ఇష్రార్‌ షేక్, ఫరూక్‌ షర్ఫుద్దీన్‌ తర్ఖాష్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉన్నందున కేసు ఫైళ్లను కింది కోర్టు గతవారం హైకోర్టుకు పంపింది. 

మరిన్ని వార్తలు