నక్కతో జల్లికట్టు : 11మందికి జరిమానా

20 Jan, 2020 07:44 IST|Sakshi
జల్లికట్టుకు ఉపయోగించిన గుంటనక్క

చెన్నై, తిరువొత్తియూరు: నిబంధనలకు విరుద్ధంగా గుంటనక్క జల్లికట్టు నిర్వహించిన 11 మందికి అటవీశాఖ అధికారులు జరీమానా విధించారు. సేలం జిల్లా వాళపాడి దాని పరిసర ప్రాంతాలలో 30 మందికిపైగా గ్రామ ప్రజలు 200 సంవత్సరాలుగా సంప్రదాయరీతిలో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. వ్యవసాయం అభివృద్ధి చెందాలని గుంట నక్కతో జల్లికట్టును నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ గుంటనక్క జల్లికట్టుకు అటవీశాఖ వారు నిషేధం విధించారు. ఈ క్రమంలో వాళపాడి సమీపం చిన్నమనాయకన్‌ పాళయంలో శనివారం డప్పు వాయిద్యాలతో గుంట నక్కతో జల్లికట్టు నిర్వహించారు.

శుక్రవారం సాయంత్రం మారియమ్మన్‌ ఆలయంలో పూజలు నిర్వహించి తరువాత 20 మంది ప్రజలు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుంట నక్క కోసం వల వేసి వేచి ఉంచారు. అర్ధరాత్రి సమయంలో గుంట నక్క వలలో చిక్కుకుంది. శనివారం ఉదయం అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన గుంట నక్కను రెండు కి.మీ దూరం గ్రామాలలో తిరగనిచ్చి మారియమ్మన్‌ ఆలయం వద్దకు తీసుకొచ్చారు. తరువాత నక్కకు పూలమాల వేసి జల్లికట్టు నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న వాళపాడి అటవీశాఖ ఉద్యోగులు చిన్నమనాయకన్‌ పాళయంకు చేరుకుని నిబంధనలను అతిక్రమించి నక్కతో జల్లికట్టు జరిపిన 11 మందిపై కేసు నమోదు చేశారు. వారికి రూ.55వేలు జరిమానా విధించారు. 

మరిన్ని వార్తలు