ఉద్యోగం పేరుతో వికృత చేష్టలు

4 Jul, 2019 04:03 IST|Sakshi
బాధితురాలు

రూ.2 లక్షలు తీసుకుని ఉద్యోగం ఇస్తానన్నాడు

ఆపై కామకోర్కెలు తీర్చితేనే జాబిస్తానన్నాడు

లొంగదీసుకుని ఐదు నెలల పాటు నరకం చూపాడు.. 

ఇప్పుడు ఉద్యోగం, డబ్బు ఇచ్చేదిలేదు పొమ్మంటున్నాడు

జిల్లా అటవీశాఖాధికారిపై గుంటూరు ఎస్పీకి వివాహిత ఫిర్యాదు

గుంటూరు: ‘అటవీశాఖలో కాంట్రాక్ట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని జిల్లా అటవీశాఖాధికారి చెప్పాడు. చివరకు రూ.2 లక్షలు తీసుకున్నాడు. డబ్బు ఒక్కటే అర్హత కాదు.. కోరికలూ తీర్చితేనే ఉద్యోగమంటూ బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఐదు నెలలు లైంగికంగా వేధించి చివరకు డబ్బు లేదు.. ఉద్యోగమూ లేదు పొమ్మన్నాడు.’ అంటూ ఓ బాధితురాలు బుధవారం గుంటూరు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకరుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన బాధితురాలు చెప్పిన వివరాల మేరకు.. భర్తతో మనస్పర్థలు రావడంతో 8 ఏళ్ల కుమార్తెతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. డీ–ఫార్మసీ చదివిన ఆమె ఉద్యోగ వేటలో పడింది.

ఈ క్రమంలో గుంటూరులోని అటవీశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మోహనరావును ఆమె మేడికొండూరు మండలం పేరేచర్లలోని ఫారెస్ట్‌ కార్యాలయంలో కలిసింది. రూ.4 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇచ్చి.. ఆపై పర్మినెంట్‌ చేస్తానని మోహనరావు చెప్పారు. అంతడబ్బు ఇచ్చుకోలేనని ప్రాథేయపడటంతో చివరకు రూ.2 లక్షలకు అంగీకరించారు. ఫిబ్రవరి 24న గుంటూరులోని కార్యాలయంలో డబ్బు ఇచ్చి దరఖాస్తు చేసింది. రోజులు గడిచినా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆయనకు ఫోన్‌ చేసి ఉద్యోగం విషయమై ప్రశ్నించింది. అయితే గుంటూరు రావాలని మోహనరావు చెప్పడంతో వెళ్లి ఆయనను కలిసింది. డబ్బులిస్తే ఉద్యోగాలు రావని, కోర్కెలు కూడా తీర్చాలన్నాడు. నిరాకరిస్తే  ఉద్యోగం రాదని బెదిరించి ఆమెను లొంగదీసుకున్నాడు. తన వికృత చేష్టలతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేశాడు. ఇలా ఐదు నెలలు గడిచినా ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఆయనను నిలదీయగా.. ఉద్యోగం లేదు.. డబ్బూ లేదని తెగేసి చెప్పాడు. మోసపోయానని గ్రహించిన ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని ఇద్వా నాయకులకు వివరించింది. 

హోంమంత్రికి ఫిర్యాదు..
ఈ క్రమంలో ఇద్వా నాయకుల సూచనల మేరకు హోంమంత్రి మేకతోటి సుచరితను మంగళవారం ఆమె కార్యాలయంలో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటనను సీరియస్‌గా పరిగణించిన హోం మంత్రి.. వెంటనే అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆమె సూచనల మేరకు బుధవారం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని మేడికొండూరు సీఐ ఆనందరావును ఎస్పీ ఆదేశించారు.

బాధితులు ఇంకా ఉన్నారు! 
తనలాగా మోసపోయిన బాధితులు మరెందరో ఉన్నారని, గుంటూరుకు చెందిన ఓ యువతి కూడా తనలాగే మోసపోయిందని బాధితురాలు చెబుతోంది. తన కార్యాలయంలో కూడా మోహనరావు కొందరిని ఇలానే వేధించాడని.. బాధితులంతా బయటకు వచ్చేందుకు భయపడుతున్నారని తెలిపింది. ఉద్యోగాల పేరుతో మహిళలను వేధిస్తున్న జిల్లా అటవీశాఖాధికారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఆయనను విధుల నుంచి తొలగించి సీఐడీ విచారణకు ఆదేశించాలని ఇద్వా వ్యవస్థాపకుడు జి.రాజసుందరబాబు డిమాండ్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు