టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదు

9 May, 2019 11:50 IST|Sakshi

నిధులు మళ్లింపు ఆరోపణలు

టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్‌ క్రైమ్‌లో కేసు నమోదు

రవిప్రకాశ్‌ కోసం తెలంగాణ పోలీసుల వేట

టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు

సాక్షి, హైదరాబాద్‌ :  ఫోర్జరీతోపాటు యాజమాన్యానికి తెలియకుండా నిధులు మళ్లించారంటూ ఆరోపణలతో టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్‌ క్రైమ్‌లో ఐపీసీ 406, 420, 467, 469, 471, 120B, 90, 160..ఐటీ యాక్ట్‌ 66,72 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ...సీఈవోపై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన సంతకాన్ని రవిప్రకాశ్‌ ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్‌ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలంద సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్‌ నివాసంతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

చదవండి:
 రవిప్రకాశ్‌ పాస్‌పోర్ట్‌ స్వాధీనం, శివాజీ ఇంట్లో సోదాలు

టీవీ9 నుంచి రవిప్రకాశ్‌కు ఉద్వాసన

కాగా కొద్దిరోజుల కిందటే ఏబీసీఎల్‌ కార్పొరేషన్‌ నుంచి 90శాతం షేర్లు కొనుగోలు చేసి టీవీ9ను అలంద మీడియా టేకోవర్‌ చేసిన విషయం తెలిసిందే. యాజమాన‍్యం మారిన తర్వాత కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకోవాలని అలంద మీడియా ప్రతిపాదించింది. డైరెక్టర్ల నియామకానికి కేంద్ర సమచారశాఖ అనుమతి ఇచ్చినా... ఆ ప్రతిపాదనను రవిప్రకాశ్‌ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డైరెక్టర్ల నియామకాన్ని వ్యతిరేకిస్తూ బోర్డు మీటింగ్‌లో కొత్తవారిని తీసుకోవద్దంటూ ప్రతిపాదిస్తూ ఇప్పటికే ఉన్న ఓ డైరెక్టర్‌ సంతకంతో డాక్యుమెంట్‌ తయారు చేయించి, అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం. అయితే ఆ సంతకం తాను చేయలేదని, డాక్యుమెంట్‌లో ఉన్న సంతకాన్ని రవిప్రకాశ్‌ ఫోర్జరీ చేశారని బాధిత డైరెక్టర్‌ ఆరోపించారు. దీంతో అలంద సంస్థ కార్యదర్శి పోలీసుల్ని ఆశ్రయించారు.

ఇక కేవలం 9శాతం వాటా మాత్రమే కలిగి ఉన్న ఆయన యాజమాన్య మార్పును అడ్డుకునేందుకు కుటిలయత్నం చేసినట్లు భోగట్టా. టీవీ9 తన నియంత్రణలోనే ఉండాలంటూ షరతులు విధించిన రవిప్రకాశ్‌ కొత్త యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. మరోవైపు టీవీ9 కార్యాలయం నుంచి కొన్ని ఫైల్స్‌, ల్యాప్‌టాప్‌తో పాటు హార్డ్‌డిస్క్‌లు మాయం అయినట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్‌తో పాటు ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు