విచ్చలవిడిగా ‘ములాఖత్‌’లు !

26 Mar, 2018 02:02 IST|Sakshi
మోహన్‌రెడ్డి సోదరుడు మహేందర్‌రెడ్డి బెంచి మీద పెట్టిన డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుంటున్న కానిస్టేబుల్‌

పోలీసులకు నజరానాలు.. సీసీ ఫుటేజీలో బట్టబయలు 

మరో వివాదంలో మాజీ ఏఎస్‌ఐ మోహన్‌ రెడ్డి 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: అక్రమ ఫైనాన్స్‌ వ్యవహారంలో అరెస్టు అయి ఏసీబీ కేసులలో 11 నెలలుగా జైలులో ఉన్న మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి వ్యవహారంలో మరో సంచలన వీడియో బయటపడింది. గతంలో కరీంనగర్‌ జైలు అధికారి కార్యాలయంలోనే సెటిల్‌మెంట్లు చేసిన వీడియో బహిర్గతం కావడంతో సూపరింటెండెంట్‌ బదిలీ కావడం సంచలనం కలిగించింది. ప్రస్తుతం ఎస్కార్ట్‌ పోలీసుల సమక్షంలో మోహన్‌రెడ్డి తన కుటుంబ సభ్యులు, అనుయాయులతో కలసి చర్చించడమే కాకుండా పోలీసులకు నజరానా ముట్టజెప్పిన దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

ఈనెల 21న కరీంనగర్‌ కోర్టుకు వచ్చిన మోహన్‌రెడ్డి, దానికి ఎదురుగా ఉన్న ఉడిపి హోటల్‌లో సాయంత్రం 6.02 గంటలకు ప్రవేశించి ఏకంగా 23 నిమిషాలు హోటల్‌లో గడిపాడు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు అక్షయ్‌రెడ్డి, తమ్ముడు మహేందర్‌రెడ్డిలతో పాటు బంధువులు, మణింధర్‌సింగ్‌లతో చర్చలు జరిపారు. 6.24 నిమిషాలకు మోహన్‌రెడ్డి సూచనల మేరకు చర్చల అనంతరం మహేందర్‌రెడ్డి హోటల్‌ బెంచీపై డబ్బులు పెట్టాడు.

మోహన్‌రెడ్డి లేవగానే అక్కడున్న కానిస్టేబుల్‌ ఆ మొత్తాన్ని తన జేబులో పెట్టుకొని నడుస్తున్న దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఎస్కార్ట్‌ పోలీసులను తక్షణమే సస్పెండ్‌ చేయాలని బాధితుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ముస్కు మహేందర్‌రెడ్డి, బండమీది సాయన్నలు , లోక్‌సత్తా నాయకులు ఎన్‌.శ్రీనివాస్, ప్రకాశ్‌ హోల్లాలు డిమాండ్‌ చేశారు. ఇదిలా వుండగా ఈ ఘటనపై స్పందించిన కరీంనగర్‌ సీపీ వీబీ కమలాసన్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు. 

మరిన్ని వార్తలు