మధుకోడాకు మూడేళ్ల జైలు

16 Dec, 2017 11:24 IST|Sakshi

బొగ్గు కుంభకోణం కేసులో దోషులకు శిక్షల ఖరారు

వైట్‌ కాలర్‌ నేరాలే అతి ప్రమాదకరమన్న సీబీఐ కోర్టు

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన జార్ఖండ్‌ మాజీ సీఎం మధుకోడాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసు, కోడా సన్నిహితుడు విజయ్‌ జోషిలకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. విసుల్‌ సంస్థకు రూ.50 లక్షలు, జోషికి రూ.25 లక్షలు; బసు, గుప్తాలకు రూ.లక్ష జరిమానావేసింది.  జార్ఖండ్‌లోని రాజారా ఉత్తర బొగ్గు గనులను విసుల్‌ సంస్థకు కేటాయించడంలో వీరు అవినీతి, నేరపూరిత కుట్రలకు పాల్పడటంతో ఈ శిక్షలు వేశామని కోర్టు వ్యాఖ్యానించింది.

‘మామూలు నేరాల కంటే వైట్‌ కాలర్‌ నేరాలే సమాజానికి అత్యంత ప్రమాదకరం. వీటి వల్ల దేశం భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోతోంది’ అని సీబీఐ కోర్టు జడ్జి భరత్‌ పరాశర్‌ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుతో మధుకోడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోనున్నారు. ఇదిలాఉండగా మొత్తం 30 బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇప్పటివరకు నాలుగింటిలో 12 మంది వ్యక్తులకు, నాలుగు సంస్థలకు శిక్షలు పడ్డాయి. కాగా తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని మధుకోడా చెప్పారు.

మరిన్ని వార్తలు