ఘోర రోడ్డు ప్రమాదం, మాజీ ఎమ్మెల్యే మృతి

7 Apr, 2019 07:46 IST|Sakshi
కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన కారు మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సుందరవేల్, భార్య విజయలక్ష్మి(ఫైల్‌)

ఆంబూరులో కంటైనర్‌ను ఢీకొన్న కారు

తిరుపత్తూరు మాజీ ఎమ్మెల్యే సుందరవేల్‌ దంపతులతో పాటు డ్రైవర్‌ మృతి

వేలూరు: ఆంబూరులో కంటైనర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరు మృతి చెందారు. వివరాలు.. వేలూరు జిల్లా తిరుపత్తూరు మాజీ ఎమ్మెల్యే సుందరవేల్‌(71) ఆయన భార్య విజయలక్ష్మి(65) శనివారం ఉదయం చెన్నైలోని ఆస్పత్రికి కారులో బయలుదేరారు. కారును అదే ప్రాంతానికి చెందిన వీరమణి నడుపుతున్నాడు. ఉదయం 6 గంటలకు ఆంబూరు సమీపంలోని విన్నమంగళం వద్ద వస్తున్న సమయంలో కంటైనర్‌ను ఓవర్‌ టేక్‌ చేయడానికి ప్రయత్నించారు. వాహనం అదుపు తప్పి కంటైనర్‌ వెనుకభాగం ఢీకొంది.

కారు కంటైనర్‌ కింద చిక్కుకుంది. గమనించని కంటైనర్‌ డ్రైవర్‌ సుమారు 25 మీటర్ల దూరం కారును ఈడ్చుకుంటూ వెళ్లాడు. అనంతరం పెద్ద శబ్దం రావడంతో వాహనాన్ని ఆపి పరిశీలించాడు. కారు లారీ అడుగు భాగంలో చిక్కుకున్న విషయం గుర్తించాడు. అప్పటికే కారులోని మాజీ ఎమ్మెల్యే సుందరవేల్, భార్య విజయలక్ష్మి, కారు డ్రైవర్‌ వీరమణి అక్కడిక్కడే మృతి చెంది ఉన్నారు.

దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులు కారులో చిక్కుకున్న మృతదేహాలను క్రేన్‌ సాయంతో రెండు గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతి చెందిన సుందరవేల్‌ 1991–96 వరకు తిరుపత్తూరు అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా పనిచేశారు. 2001 నుంచి 2006 వరకు తిరుపత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం అముముక పట్టణ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మృతి చెందిన విషయం తెలుసుకున్న అముముక పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకున్నారు. 

మరిన్ని వార్తలు