6నెలలుగా తిరుగుతున్నా.. కోర్కె తీరుస్తావా.. లేదా?

6 Jan, 2019 10:47 IST|Sakshi
బాలాజీ యాదవ్‌ను తీసుకెళ్తున్న పోలీసులు

తిరుపతి క్రైం: యువతిపై సస్పెన్షన్‌లో ఉన్న నగరి మున్సిపల్‌ మాజీ కమిషనర్‌ శనివారం దాడి చేశాడు. ప్రయాణికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల కథనం మేరకు.. తిరుపతి నగరంలో నివాసముంటున్న ఓ యువతి పుత్తూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమె తండ్రి చనిపోవడంతో తల్లితో కలిసి ఉంటోంది. ఆరు నెలలుగా యువతిని నగరి మున్సిపాలిటీ మాజీ కమిషనర్‌ బాలాజీ యాదవ్‌ తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. శనివారం పాఠశాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండుకు చేరుకుంది.

బాలాజీ యాదవ్‌ అక్కడికి చేరుకుని ఆమెను అడ్డగించాడు. ‘ఆరు నెలలుగా నీ వెంట తిరుగుతున్నాను. నా కోర్కెను తీరుస్తావా.. లేదా?’ అంటూ వాగ్వాదానికి దిగాడు. ఆమె మాట్లాడకపోవడంతో దాడికి పాల్పడ్డాడు. ప్రయాణికులు ప్రశ్నించడంతో తిరగబడ్డాడు. ప్రయాణికులు అతనికి దేహశుద్ధి చేసి ఈస్టు పోలీసులకు అప్పగించారు. బాలాజీయాదవ్‌ నగరి మున్సిపల్‌ కమిషనర్‌గా పని చేసేవాడు. 2015లో నగరి ఎమ్మెల్యేతో గొడవపడ్డాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు.

మరిన్ని వార్తలు