ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

1 Sep, 2018 10:54 IST|Sakshi
పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తీసుకెళుతున్న కార్మికులు (ఇన్‌సెట్‌) మణికంఠ (ఫైల్‌)

అన్నానగర్‌: పర్యాటకానికి తీసుకెళ్లి కార్మికుడిని హత్య చేసిన ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల హత్య చేసినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. మదురై జైహింద్‌పురం సోలై అళగపురానికి చెందిన వెంకట్‌రామన్‌ కుమారుడు మణికంఠన్‌ (34). ఇతను టీ దుకాణంలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి ఇంకా వివాహం కాలేదు. ఈ స్థితిలో గత 23వ తేదీ నుంచి మణికంఠన్‌ అదృశ్యమయ్యాడు. దీనిపై అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మదురై జైహింద్‌పురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు.

మణికంఠన్‌ అదృశ్యమైన రోజున అతడు సెల్‌ఫోన్‌లో మాట్లాడిన వారి వివరాలను సేకరించారు. జైహింద్‌పురానికి చెందిన శ్రీనివాసన్‌తో మణికంఠన్‌ చివరగా ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. పోలీసులు అతన్ని పట్టుకుని విచారణ చేయగా తన స్నేహితుడు శరవణన్‌ భార్య వనితతో మణికంఠన్‌ వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల హత్య చేసినట్టు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పథకం ప్రకారం నలుగురు స్నేహితులతో కలిసి మణికంఠన్‌ను పర్యాటకానికి అని చెప్పి కొడైకెనాల్‌ తీసుకెళ్లి కత్తితో పొడిచి హత్యచేసి మృతదేహాన్ని లోయలో విసిరేసినట్టు తెలిపారు. పోలీసులు గురువారం సంఘటనా స్థలానికి వెళ్లి 1,500 అడుగుల లోయలో ఉన్న మణికంఠన్‌ మృతదేహాన్ని తీసుకొచ్చి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి శ్రీనివాసన్, శరవణన్‌ను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు