స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం

29 May, 2019 09:00 IST|Sakshi

ఆమెకు మత్తు మందు ఇచ్చి  పసికందు అపహరణ

నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

ఆ శిశువు తన బిడ్డేనంటూ నిందితుడి వాదన

డీఎన్‌ఏ పరీక్షకు పంపాలని పోలీసుల నిర్ణయం

యశవంతపుర: వివాహితకు మత్తు మందు ఇచ్చి 11 నెలల చిన్నారిని అపహరించిన నిందితుడిని కామాక్షిపాళ్య పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుంకదకట్టకు చెందిన కుమార్‌ దంపతులకు చెందిన 11 నెలల చిన్నారిని రామమూర్తినగరకు చెందిన జాన్‌ అనే వ్యక్తి అపహరించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కుమార్, జాన్‌లు ఒకే సంస్థలో సూపర్‌వైజర్లగా పని చేస్తున్నారు.  రెండేళ్ల నుంచి వీరు స్నేహితులు. ఈక్రమంలో కుమార్‌ భార్యతో జాన్‌ సన్నిహితంగా ఉండేవాడు.  కొంతకాలంగా జాన్, కుమార్‌ మద్య విభేదాలు నెలకొన్నాయి. ఈక్రమంలో ఈ నెల 24న కుమార్‌ ఇంటికి వచ్చిన జాన్‌.. బరువు తగ్గేందుకంటూ మత్తు మందు కలిపిన ఔషధాన్ని కుమార్‌ భార్యతో తాగించాడు.

ఆమె స్పృహ కోల్పోగానే 11 నెలల చిన్నారిని జాన్‌ అపహరించాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన కుమార్‌.. బాలుడు కనిపించకపోగా భార్యను ఆరా తీశాడు. జాన్‌ ఇచ్చిన ఔషధాన్ని తాగిన వెంటనే స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని పేర్కొంది. దీంతో కుమార్‌  కామాక్షిపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టి  రామమూర్తినగరలో తలదాచుకున్న జాన్‌ను అరెస్ట్‌ చేశారు.  అయితే కుమార్‌ భార్యతో తనకు రెండేళ్లుగా వివాహేతర సంబంధం ఉందని, ఆమెకు పుట్టిన బిడ్డ తన బిడ్డేనని జాన్‌ వాదించాడు. అయితే ఆ పసికందు తనబిడ్డనే అని కుమార్‌ వాదించాడు. దీంతో  ఉన్నత అధికారులతో చర్చించి న్యాయ సలహా తీసుకొని ఆ చిన్నారి రక్తశ్యాంపుల్స్‌ను డీఎన్‌ఏ పరీక్షలకు పంపాలని పోలీసులు నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు