వివాహేతర సంబంధం.. అనుమానం రాకుండా.. 

19 Sep, 2018 09:27 IST|Sakshi
వాగులో పూడ్చిన మృతదేహాన్ని బయటికి తీయిస్తున్న సీఐ పాండురంగారెడ్డి

మూసాపేట (దేవరకద్ర): యువకుడి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసిందని తేలిపోయింది. అనుమానాస్పదంగా బయటపడిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి పక్కాప్లాన్‌తో హత్య జరిగినట్లు తేల్చారు. భూత్పూరు సీఐ పాండురంగారెడ్డి కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా..మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన నాగరాజు (22), చెన్నకేశవులు అనే యువకులు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇదే విషయంపై వారి మధ్య కొన్నిరోజులుగా అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి. అయితే వీరి విషయం గురించి శ్రీకాంత్‌ అనే యువకుడికి తెలిసింది. శ్రీకాంత్‌కు సదరు మహిళ  చిన్నమ్మ కావడంతో మొదట నాగరాజును పలుమార్లు హెచ్చరించాడు. తీరు మార్చుకోక పోవడంతో నాగరాజును ఎలాగైన అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.
 
చెన్నకేశవులుతో చేతులు కలిపి.. 
వరుసకు చిన్నమ్మ అయిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని సహిం చలేని శ్రీకాంత్‌ ఎలాగైనా బోయ నాగరాజును చంపాలని నిర్ణయించుకుని చెన్నకేశవులు సాయం కోరాడు. అతడు ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి ఈనెల 9వ తేదీన ఆదివారం రాత్రి నాగరాజును మాటల్లో పెట్టి గ్రామ సమీపంలోని వాగులోకి తీసుకెళ్లారు. పక్కా ప్లాన్‌తో రాత్రి 11 గంటల సమయంలో వివాహేతర సంబంధంపై గొడవ పెట్టుకున్నారు. తనపై దాడి జరుగుతుందని పసిగట్టిన నాగరాజు వారినుంచి తప్పించుకునేందుకు కళ్లలో ఇసుక చల్లి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయినా వెంబడించి వెంట తెచ్చుకున్న కత్తితో కడుపులో పొడిచి చంపేశారు.
 
అనుమానం రాకుండా.. 
కసితీరా చంపిన ఇద్దరు ఎవరికీ అనుమానం రాకుండా ముందుగా వాగులో గోతి తీశారు. తల, మొండాన్ని వేరుచేసి ముందుగా తీసిన గోతిలో పూడ్చివేశారు. అనంతరం తలను కాస్త దూరంలో పూడ్చిపెట్టారు. మరుసటి రోజునుంచి తమకు ఏ మీ తెలియనట్లు వ్యవహరిస్తూ నటించారు. అయి తే సోమవారం రాత్రి వాగులో అనుమానాస్పదంగా  మృతదేహం బయట పడింది. విషయం కాస్త పోలీసుల చెవిన పడటంతో వారు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ మొదలెట్టారు.
 
తలను గుర్తించిన జాగిలం 
మంగళవారం ఉదయం పోలీసులు జిల్లా కేంద్రం నుంచి జాగిలాన్ని తీసుకొచ్చి విచారణ ప్రారంభించారు. బయటపడిన మొండెం నుంచి దాదాపు కిలోమీటరు వరకు వెళ్ళిన జాగిలం తల పాతిన ప్రదేశానికి వెళ్లి ఆగింది. ఆ ప్రాంతంలో వెతుకగా తల బయటపడింది. కొన్నిరోజులుగా అదృశ్యమైన నాగరాజుగా స్థానికులు, కుటుంబ సభ్యులు గుర్తించారు.
  
అడ్డుకున్న గ్రామస్తులు 
ఈ సంఘటన గురించి బయటపడగా మొదట గ్రామస్తులు ఎక్కడ గొడవలు జరుగుతాయోనని పోలీసులు విచారణ చేస్తుండగా అడ్డుకున్నారు. దాదాపు 6 గంటల పాటు శవాన్ని వెలికితీయకుం డా అడ్డుచెప్పడంతో సీఐ, ఎస్‌ఐ  గ్రామస్తులను ఒప్పించి మధ్యాహ్నం 1.15 గంటలకు యువకుని మృత దేహాన్ని వెలికి తీయించారు. తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డి, సీఐ పాండురంగారెడ్డి సమక్షంలో పంచనామా చేసి జిల్లా కేంద్రం నుంచి వచ్చిన డాక్టర్లతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.
 
పోలీసుల బందోబస్తు.. 
సోమవారం సాయంత్రం వాగులో మొండెం భ యట పడటంతో రాత్రి నుంచి మంగళవారం వర కు గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల ఎస్‌ఐతోపాటు చుట్టుపక్క మండలాల ఎస్‌ఐలు, 70 మంది పోలీసులను గ్రామంలో దించారు.
 
వీడిన అదృశ్యం మిస్టరీ  
వాగులో తేలిన మొండెం నాగరాజుదేనా లేక మరెవరిదైనా అని ఇటు గ్రామస్తులు, అటు పోలీసులు మొదట తర్జన భర్జన పడ్డారు. కొన్ని రోజులుగా అదృశ్యమైన యువకుడు ఎక్కడికెళ్లాడని మరోపక్క ఆందోళన కొనసాగింది. చవరికి వాగులో శవంగా తేలడం పోలీసులు లోతుగా విచారణ చేశారు. మృతుడు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేవాడని తెలియడంతో ఆ కోణంలో దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు చెన్నకేశవులు, శ్రీకాంత్‌లను విచారించగా వారు ఒప్పుకుని లొంగిపోయారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఆర్‌ఐ అహ్మద్, వీఆర్వో మంజుల, నియోజకవర్గంలోని ఎస్‌ఐలు విచారణలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు