నగదుతో ఉడాయించిన నలుగురి అరెస్ట్‌

8 May, 2019 13:35 IST|Sakshi
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ

రూ.25.5 లక్షల స్వాధీనం

మరో నిందితుడి కోసం గాలింపు

నెల్లూరు(క్రైమ్‌): ధాన్యం దళారికి సంబంధించిన నగదుతో ఉడాయించిన ఘటనలో నలుగురు నిందితులను మంగళవారం వేదాయపాళెం పోలీసులు మూడో మైలులో అరెస్ట్‌ చేశారు. వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ మురళీకృష్ణ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. దగదర్తికి చెందిన ధాన్యం దళారి చావా సురేష్‌ చుట్టుపక్కల గ్రామాల నుంచి ధాన్యాన్ని సేకరించి తమిళనాడు రాష్ట్రం రెడ్‌హిల్స్‌లోని రాధామండికి నెల్లూరు ఆటోనగర్‌లోని రమేష్‌కు చెందిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర లారీ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా పంపేవారు. కొన్ని సందర్భాల్లో రాధామండి ధాన్యం తాలూకు నగదును లారీడ్రైవర్ల ద్వారా చావా సురేష్‌కు పంపేవారు. ఈ క్రమంలో మార్చి 29న ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని రమేష్‌ ధాన్యానికి సంబంధించిన రూ 83.8 లక్షల నగదును సిబ్బంది దామోదర్‌రావు, బాబూరావు సమక్షంలో తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్లు మాధవరాజ్‌ అలియాస్‌ మాధవ, జీవాకు ఇచ్చి చావా సురేష్‌కు అందజేయాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా తనిఖీలు ఎక్కువగా ఉంటాయని.. డబ్బులను గోతం సంచీల్లో కట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్లి సురేష్‌కు ఇవ్వాలని చెప్పారు. దీంతో జీవా, మాధవ్‌రాజ్, దామోదర్‌రావు లారీలో దగదర్తి మండలం మర్రిపాడుకు బయల్దేరారు. ఈ క్రమంలో మాధవ్‌రాజ్‌ తన స్నేహితులతో కలిసి లారీలో నుంచి నగదును దొంగలించి పారిపోయారు. దీనిపై బాధితుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ నరసింహరావు తన సిబ్బందితో కలిసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

నగదును దోచుకెళ్లింది ఇలా..
తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా థిండివనం తాలూకా వల్లిమేడుపట్టికి చెందిన మాధవ్‌రాజ్‌ అలియాస్‌ మాధవ అలియాస్‌ ఈఎస్‌ మాధవ్‌ కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు వచ్చారు. మూడోమైలు నవలాకులతోటలో నివాసం ఉంటూ ఆటోనగర్‌లోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర లారీ ట్రాన్స్‌పోర్ట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌ (ప్రస్తుతం కోడూరుపాడు గ్రామం కలిటికాలనీ)కు చెందిన డ్రైవర్‌ బెంగాల్‌ నిర్మల్‌రాయ్, ఇందుకూరుపేట జగదేవిపేటకు చెందిన డ్రైవర్‌ శివప్రసాద్‌రెడ్డి, నెల్లూరు వెంకటేశ్వరపురం భగత్‌సింగ్‌కాలనీకి చెందిన డ్రైవర్‌ అన్వర్‌ స్నేహితులు. తరచూ వీరు కలుసుకొని పార్టీలు చేసుకునేవారు. మాధవ్‌రాజ్‌ చెడు వ్యసనాలకు బానిసై అప్పులపాలయ్యాడు. ఎలాగోలా డబ్బు సంపాదించి వాటి నుంచి బయటపడాలని నిశ్చయించుకొని స్నేహితుల సహకారం కోరారు. దీనికి స్నేహితులు అంగీకరించడంతో అదును కోసం వేచిచూడసాగారు. ఈ నేపథ్యంలో మార్చి 29న ట్రాన్స్‌పోర్ట్‌ యజమాని రమేష్‌ రూ.83.8 లక్షల నగదును దళారి సురేష్‌కు ఇవ్వాలని డ్రైవర్‌ రమేష్, జీవాకు ఇచ్చారు. వీరితో పాటు దామోదర్‌రావును లారీలో పంపారు. నగదును గోతం సంచిలో కట్టుకొని లారీ బాడీలో  ఉంచారు.

ఈ క్రమంలో మాధవ్‌రాజ్‌ విషయాన్ని తన స్నేహితులకు తెలియజేసి నగదును కాజేసేందుకు పన్నాగం పన్నారు. నిర్మల్‌రాయ్, శివప్రసాద్‌రెడ్డి, అన్వర్, దొంతలి శివ శతృఘ్న అలియాస్‌ శివ, తిరుపతి శివ ఆటోలో లారీని వెంబడించారు. కోవూరు లారీ యార్డ్‌ సమీపంలో గుంతలు ఉండటంతో లారీ నెమ్మదిగా పోతుండగా తిరుపతి శివ లారీ ఎక్కి డబ్బులు ఉన్న గోనె సంచిని తస్కరించి ఆటోలో వేసుకొని పరారయ్యారు. మధ్యలో మాధవ్‌రాజు లారీ నుంచి కిందికి దిగిపోయారు. అందరూ కలిసి మూడోమైలులోని మాధవ్‌రాజు ఇంటి వద్దకు చేరుకున్నారు. తిరుపతి శివ ఒక్కొక్కరికీ రూ.14 లక్షల చొప్పున ఇచ్చి మిగిలిన నగదును తాను తీసుకొని వెళ్లిపోయారు.  ఆ నగదుతో అందరూ విలాసవంతంగా జీవించసాగారు. వీరి కదలికలపై పోలీసులు నిఘా ఉంచి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు మాధవ్, బెంగాల్‌ నిర్మల్‌రాయ్, శివప్రసాద్‌రెడ్డి, అన్వర్‌ మంగళవారం మూడోమైలులోని మాధవ్‌ ఇంటి వద్ద ఉన్నారనే సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ నరసింహరావు తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. వీరి నుంచి రూ.19.37 లక్షల నగదు, రూ 6,13,755 విలువజేసే బంగారు ఆభరణాలు, నగదును దోచుకునేందుకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడైన తిరుపతి శివ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని నగర డీఎస్పీ వెల్లడించారు. నిందితులు శివప్రసాద్‌రెడ్డి, అన్వర్‌ గతంలో హత్య కేసులో నిందితులని చెప్పారు. కేసును ఛేదించేందుకు కృషిచేసిన ఇన్‌స్పెక్టర్‌ నరసింహరావు, ఎస్సై పుల్లారెడ్డి, ఏఎస్సై ప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్‌ సుధ, జిలానీ, గోపాల్, తదితరులను డీఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు.  

మరిన్ని వార్తలు