మత్తు మందిచ్చి.. బావిలో పడేసి..

25 May, 2020 01:46 IST|Sakshi

గొర్రెకుంట మరణాలపై వీడిన మిస్టరీ

9 మంది హత్యకు సూత్రధారి సంజయ్‌కుమార్‌ యాదవ్‌

పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు

మక్సూద్‌ కుమారుడు బర్త్‌డే వేదికగా హత్యకు స్కెచ్‌

సంజయ్‌తోపాటు పోలీసుల అదుపులో మరో నలుగురు  

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెకుంట 9 మరణాల వెనుకున్న మిస్టరీ వీడింది. వరంగల్‌ నగర శివారు గొర్రెకుంటలోని ఓ పాడుపడిన వ్యవసాయ బావిలో ఈ నెల 21, 22 తేదీల్లో 9 మృతదేహాలు బయటపడటం వెనుక జరిగింది సామూహిక హత్యలేనని తేలింది. మహ్మద్‌ మక్సూద్‌ ఆలం కూతురు బుష్రా ఖాతూన్‌ ప్రియుడిగా అనుమానిస్తున్న సంజయ్‌కుమార్‌ యాదవ్‌ తన బిహార్‌ స్నేహితులతో కలసి వారిని హత్య చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదే విషయాన్ని ప్రధాన నిందితుడు ఈ కేసు కోసం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచా రణలో అంగీకరించినట్లు సమాచారం. ఈ నెల 20న రాత్రి ముందుగా కూల్‌డ్రింక్స్‌లో నిద్ర మాత్రలు ఇచ్చి వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నాక స్నేహితుల సాయంతో గోనెసంచుల్లో పెట్టి పాడుపడిన వ్యవసాయబావిలో పడేసినట్లు నింది తులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సంజయ్‌కుమార్‌కు ఎవరెవరు సహకరించారనేది ఇంకా తెలియాల్సి ఉండగా సంజయ్‌తోపాటు మిడిదొడ్డి యాకూబ్, మంకుషా, మక్సూద్‌ మరదలు, ఓ ఆటో డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. మక్సూద్‌ కుమారుడు సోహిల్‌ ఆలం పుట్టినరోజు 10 రోజుల క్రితం జరగ్గా అదేరోజు 9 మంది హత్యకు నిందితులు స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది.

గుట్టువిప్పిన పోస్టుమార్టం
సంజయ్‌కుమార్, ఇతర నిందితులు సాగించిన సామూహిక హత్యాకాండను పోస్టుమార్టం నివేదికలు నిగ్గుతేల్చాయి. మరణించిన తొమ్మిది మందిలో ఏడుగురి ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్‌ హెడ్‌ డాక్టర్‌ రజా మాలిక్‌ వెల్లడించారు. మిగతా ఇద్దరిని మాత్రం వారు చనిపోయాక నిందితులు బావిలో పడేసినట్లు నిర్ధారించారు. అలాగే ఈ హత్యల కోసం ఈ నెల 20న రాత్రి 7 గంటలకు సంజయ్‌కుమార్‌ యాదవ్‌ డ్రైవర్‌ షకీల్‌కు ఫోన్‌ చేసి వెంకట్రామ థియేటర్‌ చౌరస్తాకు రావాలని సూచించగా అతను యాకూబ్‌ పాషాతో కలసి గొర్రెకుంట గోనెసంచుల గోదాం వద్దకు వచ్చినట్లు సమాచారం. ఆ ముగ్గురు కలసి వెంకట్రామ థియేటర్‌ చౌరస్తా సమీపంలో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డవగా 21న ఉదయం 6.30 గంటలకు యాకూబ్, సంజయ్‌కుమార్‌ మాత్రమే తిరిగి వచ్చినట్లు రికార్డయినట్లు సమాచారం. అదే విధంగా గొర్రెకుంట బావికి కిలోమీటర్‌ దూరంలో లభ్యమైన సెల్‌ఫోన్‌ కాల్‌డేటా కూడా హంతకుడిని కనిపెట్టడంలో కీలకంగా మారినట్లు తెలిసింది. ఈ క్లూల ద్వారా కూడా పోలీసులు ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు చెబుతున్నారు.

కాగా, గొర్రెకుంటలో 9 మంది సామూహిక హత్యల వెనుక ఆర్థిక లావాదేవీల గొడవలు ఉన్నాయా లేక వివాహేతర సంబంధాలా అనే విషయం తెలియాల్సి ఉంది. మహ్మద్‌ మక్సూద్‌ ఆలం గోనెసంచులు కుడుతూ జీవనం గడుపుతున్నా ఇటీవలే ఖరీదైన ప్లాట్లు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. రంజాన్‌ సందర్భంగా ఆయన చనిపోవడానికి రెండు రోజుల ముందు రూ. 25 వేల విలువైన సామగ్రి ఖరీదు చేసినట్లు సమాచారం. అలాగే భర్తతో విడిపోయిన మక్సూద్‌ కూతురు బుష్రా ఖాతూన్‌కు సంజయ్‌కుమార్‌ యాదవ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. బుష్రాకు తన తల్లితో గొడవలు జరుగుతున్నట్లు కూడా తెలిసింది. ఇంటి పైవాటాలో ఉంటున్న బిహార్‌కు చెందిన కార్మికులు శ్రీరాం, శ్యామ్‌లు వీరి గొడవలో జోక్యం చేసుకొని బుష్రాపై కన్నేసినట్లు తెలియవచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సంజయ్‌కుమార్‌ పథకం ప్రకారం 9 మందిని హతమార్చినట్లు మరో ప్రచారం ఉంది. ఏదేమైనా నేడో, రేపో ఈ ఘటనపై పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారికంగా వివరాలు వెల్లడించనున్నారు. కాగా, హైదరాబాద్‌ సిటీ క్లూస్‌ టీం ఆదివారం గొర్రెకుంటలో పలు ఆధారాలను సేకరించింది. ఎంజీఎంలో ఉన్న 9 మృతదేహాలపై ఫింగర్‌ప్రింట్స్‌తోపాటు రక్తం, శరీర ద్రవాలు, జుట్టు, ఇతర కణజాలాలకు సంబంధించిన జీవ ఆధారాలను కూడా సేకరించినట్లు ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది.

మరిన్ని వార్తలు