సోషల్‌ మీడియాలో పోస్ట్‌లతో అరెస్టులు

18 Feb, 2019 04:57 IST|Sakshi

ఉగ్రదాడిపై పాక్‌ అనుకూల, భారత వ్యతిరేక పోస్ట్‌లు

కశ్మీరీలను వెలేస్తే పాక్‌ లక్ష్యం నెరవేరినట్లే: ఒమర్‌ అబ్దుల్లా

నకిలీ పోస్ట్‌ల గురించి సమాచారమివ్వండి: సీఆర్‌ఫీఎఫ్‌

జైపూర్‌/సిమ్లా/రాయ్‌పూర్‌/బెంగళూరు: పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్‌ అనుకూల, భారత వ్యతిరేక పోస్ట్‌లు చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. రాజస్తాన్‌ రాజధాని జైపూర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో పారామెడికల్‌ విద్యనభ్యసిస్తున్న నలుగురు కశ్మీరీ విద్యార్థినులు తల్వీన్‌ మంజూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్‌లు ఉగ్రదాడికి సంబరాలు చేసుకుంటూ, ఆ ఫొటోలను వాట్సాప్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో వెంటనే విద్యా సంస్థ వారిని సస్పెండ్‌ చేసి పోలీసులకు అప్పగించింది. నలుగురు అమ్మాయిలపై పోలీసులు దేశ ద్రోహం సహా పలు కేసులు నమోదు చేశారు.

కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న జిలేఖా బీ అనే మహిళ కూడా ఫేస్‌బుక్‌లో ‘పాకిస్తాన్‌ కీ జై’ అని పోస్ట్‌ చేయడంతో పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు కస్టడీ విధించింది. కర్ణాటకలో శనివారమే మరో యువకుణ్ని కూడా పోలీసులు ఇదే విషయమై అరెస్టు చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో చదువుతున్న మరో కశ్మీరీ తహ్సీన్‌ గుల్‌ ఇన్‌స్టాగ్రాంలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లోనూ కైఫ్‌(18) ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని పోస్ట్‌ చేసి అరెస్టయ్యాడు. మరోవైపు బయట పరిస్థితులు బాగాలేనందున కశ్మీరీ విద్యార్థులు క్యాంపస్‌ దాటి బయటకు రాకూడదని యూపీలోని అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయం సూచించింది.

మన మధ్య గొడవలే శత్రువు లక్ష్యం..
మిగతా భారతీయులు కశ్మీరీలను వెలేస్తే పాక్‌ లక్ష్యం నెరవేరినట్లు అవుతుందనీ, కొందరు అత్యుత్సాహపరులు తామేం చేస్తున్నారో మెదడుతో ఆలోచించాలని జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా అన్నారు.  ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కశ్మీరీ యువతపై మీరు దాడి చేసి, వారిని వెలేసి ఎవరికి ప్రయోజం చేకూర్చదలచారు? కశ్మీర్‌ వదిలేసి బయటకొచ్చి బతుకుతున్న వారిని కశ్మీరీ ఆదర్శవంతులుగా మీరు చూడాలి. అలాంటివారిపై దాడులు చేయడం ద్వారా కశ్మీరీ లోయలో తప్ప మిగతా భారత దేశంలో వారికి స్థానం, భవిష్యత్తు లేదనే సందేశాన్ని మీరిస్తున్నారు. కశ్మీరీలు, మిగతా భారతీయుల మధ్య గొడవలు సృష్టించాలన్న శత్రువు లక్ష్యాన్ని మీరే నెరవేరుస్తున్నారు’ అని ఒమర్‌ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవి నకిలీ ఫొటోలు.. నమ్మొద్దు
పుల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన సైనికుల శరీర భాగాలుగా చెబుతూ కొన్ని నకిలీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయనీ, వాటి ని ఎవరూ నమ్మవద్దని సీఆర్‌పీఎఫ్‌ ఆదివారం ప్రజలకు సూచించింది. దేశంలో ద్వేషం పెంచేందుకు కొందరు దుండగులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారనీ, ఆ ఫొటోలను ఎవరూ ఇతరులకు ఫార్వర్డ్‌ చేయవద్దని కోరింది. ‘దయచేసి అలాంటి పోస్ట్‌లు, ఫొటోలను షేర్, లైక్‌ చేయకండి. ఇతరులకు పంపకండి’ అని సీఆర్‌పీఎఫ్‌ తెలిపింది. ఒకవేళ ఎవరికైనా అలాంటి ఫొటోలు, పోస్ట్‌లు వస్తే   webpro@ crpf.gov.inMì కి తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని కోరింది.  

మరిన్ని వార్తలు