నకిలీ కంపెనీల సృష్టికర్తల అరెస్ట్‌

18 Sep, 2019 08:18 IST|Sakshi
నకిలీ కంపెనీల సృష్టికర్తలను మీడియా ముందు హాజరు పరిచిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తదితరులు

ఆ నలుగురు నకిలీ కంపెనీల సృష్టికర్తలు

తక్కువ వడ్డీకే రుణం అంటూ పలువురి నుంచి పత్రాల సేకరణ

వాటి సాయంతో 278 నకిలీ కంపెనీల సృష్టి

సర్కారు ఖజానాకు రూ.85 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా

సాక్షి, ఒంగోలు: నలుగురు వ్యక్తులు ఏకంగా 278 నకిలీ కంపెనీలను సృష్టించారు. వాటి సాయంతో రూ.290 కోట్లకుపైగా విలువైన గ్రానైట్‌ను రవాణా చేశారు. ఈ నకిలీ బాగోతం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.85 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరిపితే మరో రూ.85 కోట్ల మేర మోసాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తెలిపారు. మంగళవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో ఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసు వివరాలు వెల్లడించారు. దీనిని ప్రకాశం పోలీస్‌ ఫేస్‌బుక్‌ లైఫ్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మార్టూరు పరిసర ప్రాంతాలలో నకిలీ గ్రానైట్‌ వ్యాపారాలు సిండికేట్‌గా చేస్తున్నట్లుగా పేర్కొంటూ అద్దంకి స్టేట్‌ టాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.పి.శ్రీనివాస్‌ అద్దంకి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఇటీవల ప్రజలు నివాసం ఉండని డోర్‌ నంబర్లు, అసలు డోర్‌ నంబర్లే లేకుండా సృష్టించి కంపెనీలను తయారు చేసి కొందరు ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున మోసం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో అద్దంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో వన్‌మేన్‌ ఫ్రీ బిజినెస్‌ పాలసీ పేరుతో వ్యాపారం ప్రారంభించేందుకు ప్రభుత్వం కల్పించిన సులభతర విధానాన్ని నిందితులు దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 2018 ఫిబ్రవరి 6వ తేదీ మొదలు 2019 ఆగస్టు 28వ తేదీ వరకు 17 జీ మెయిల్స్‌ ద్వారా 16 సెల్‌ఫోన్‌ నంబర్లు మార్చి అద్దంకి, చిలకలూరిపేట, చీరాల, ఒంగోలు 1, 2 వాణిజ్య పన్నులశాఖ అధికారుల కార్యాలయాల పరిధిలో  278 గ్రానైట్‌ ట్రేడింగ్‌ ఫరాలను ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్‌ చేశారని ఈ ఫరంల ద్వారా 18239 ఈ వే బిల్లులలు జనరేట్‌ చేసి రూ.290,49,75,081 వ్యాపారం జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.

దర్యాప్తు ఇలా..
ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రూ.52కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదిదారు పేర్కొనడంతో ఎస్పీ దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. చీరాల డీఎస్పీ వై.జయరామసుబ్బారెడ్డి నేతృత్వంలో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌)ను ఏర్పాటు చేశారు. ఆయనకు సహాయంగా అద్దంకి సీఐ టి.అశోక్‌వర్థన్, ఇంకొల్లు సీఐ రాంబాబు, మార్టూరు ఎస్సై కె.మల్లికార్జునలను ఈ సిట్‌ బృందంలో ఉంచారు. వీరు నిఘా పెట్టడంతో నలుగురు వ్యక్తులు ఇందులో కీలకంగా వ్యవహరించారని గుర్తించారు. వారిలో చిలకలూరిపేటకు చెందిన జంపని వెంకట సుబ్బారావు అలియాస్‌ సుబ్బు, చిలకలూరిపేట వడ్డెపాలెం వాసి చేబ్రోలు రమేష్‌లు ఈమెయిల్స్‌ ద్వారా 222 కంపెనీలను సృష్టించినట్టు వెల్లడయింది. వీరికి శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు గ్రామ నివాసి లోలుగు గౌరినాయుడు, ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చిన్నంబొట్లవారిపాలేనికి చెందిన ఎర్రగోపు మహేంద్రలు సహకరించారు. నకిలీ కంపెనీలు సృష్టించడానికి అవసరమైన ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, విద్యుత్‌ బిల్లు, బ్యాంకు అకౌంట్‌ పాస్‌బుక్, అద్దె ఒప్పంద పత్రం, ఫొటో మొదలైన ధృవ పత్రాలను సేకరించేవారు.

ఇలా సేకరించిన వాటిని నకిలీ కంపెనీ సృష్టించేందుకు ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయడం, జీఎస్‌టి జెనరేట్‌ చేయడం ద్వారా శ్రీకాకుళంకు చెందిన లోలుగు గౌరినాయుడు ఒక్కో నకిలీ కంపెనీ సృష్టికి రూ.7వేలు చొప్పున ప్రధాన నిందితుడు జంపని వెంకట సుబ్బారావు వద్దనుంచి రూ.3,78,000 పొందాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే అమాయక ప్రజలకు తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో రుణం ఇప్పిస్తామంటూ వారిని మోసగిస్తూ వీటిని సేకరించేవారన్నారు. అయితే రుణం ఇంకా రాలేదని జనం భావించేవారే కాని వారు వాటిని వినియోగించుకుంటూ వారి పేర్లపై తప్పుడు కంపెనీలు సృష్టిస్తున్నారని మాత్రం గ్రహించలేకపోయారన్నారు. వాస్తవానికి కంపెనీని ఆన్‌లైన్‌లో సృష్టించి జీఎస్‌టీ నంబర్‌ తీసుకుని నకిలీ ఈ వేబిల్లులను సృష్టించి సరుకు రవాణా చేసేవారన్నారు. రవాణా అయిన రు290,49,75,081 విలువచేసే గ్రానైట్‌ లోడు రాయికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్‌ రూ.52,20,19,033గా ఉందన్నారు. మొత్తం 6,38,36,050 చదరపు అడుగుల రాయి తరలింపు ద్వారా ప్రభుత్వానికి రూ.33కోట్లు రాయల్టీ చెల్లించాల్సి ఉందన్నారు. కానీ నెల పూర్తి కాగానే సంబంధిత కంపెనీని మూసివేసేవారన్నారు. ఇలా నెలకు దాదాపు 70 నుంచి 80 నకిలీ కంపెనీల ద్వారా లావాదేవీలు సృష్టించేవారన్నారు.

దర్యాప్తు ముమ్మరం..
అయితే ప్రాథమికంగా ప్రభుత్వానికి జమ కావాల్సిన టాక్స్, రాయల్టీ రూ.85 కోట్లు ఉందని, తమ దర్యాప్తులో వీరితోపాటు మరికొందరు కూడా సిండికేట్‌గా ఉన్నారని భావిస్తున్నామన్నారు. మంగళవారం మధ్యాహ్నం మార్టూరులోని గొట్టిపాటి హనుమంతరావు కాలనీ వద్ద అదుపులోకి తీసుకున్నపుడు వారి వద్ద సుమారు 100 మందికి సంబంధించిన ధృవపత్రాలు లభ్యమయ్యాయన్నారు. వాటితో పాటు ఒక కారు, మోటారు సైకిల్, సెల్‌ఫోన్సు సీజ్‌ చేశామన్నారు. ఒక వైపు ఫ్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలపై దృష్టి సారించడం, పారదర్శక పాలన వైపుగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్న దశలో అక్రమ వ్యవహారాలపై కఠినతరంగా వ్యవహరించేందుకు ప్రకాశం పోలీస్‌ కృతనిశ్చయంతో ఉందన్నారు. వాణిజ్య పన్నులశాఖ, మైనింగ్, రవాణాశాఖలతో సంయుక్తంగా తాము ఈ అక్రమాలను అరికట్టాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో చీరాల డీఎస్పీ వై.జయరామసుబ్బారెడ్డి, ఎస్‌బీ డీఎస్పీ రాంబాబు, అద్దంకి, ఇంకొల్లు సీఐలు అశోక్‌వర్థన్, వి.రాంబాబు, మార్టూరు ఎస్సై కె.మల్లికార్జున తదితరులు ఉన్నారు.

>
మరిన్ని వార్తలు