విషాదాన్ని మిగిల్చిన విహారయాత్ర

19 Jan, 2020 07:57 IST|Sakshi

ఆలయాల సందర్శన ముగిసేలోగా అనంతలోకాలకు 

తూత్తుకూడి వద్ద కారు, కంటైనర్‌ లారీ ఢీ 

ఇద్దరు యువతులు, బాలుడు సహా నలుగురు మృతి 

సాక్షి, చెన్నై: సంక్రాంతి సంబరాలు, ఆలయాల సందర్శనలోని ఆనందం ఆ రెండు కుటుంబాల్లో ఎంతోసేపు నిలవలేదు. విహారయాత్రగా ఆలయాల సందర్శనకని బయలుదేరిన ఆ కుటుంబసభ్యులపై విధివైపరీత్యం కంటైనర్‌ లారీ రూపంలో విరుచుకుపడింది. ఇద్దరు యువతులు, ఒక బాలుడు సహా నలుగురు ప్రాణాలను హరించివేసింది.  చెన్నై అడయారులోని శాస్త్రినగర్‌కు చెందిన పారిశ్రామికవేత్త సుభాష్‌ చంద్రబోస్‌ (73) సంక్రాంతి పండుగ రోజుల్లో కుటుంబసభ్యులతో కలిసి ఆలయాలు సందర్శించాలని తలంచారు. భార్య లక్ష్మిప్రియ, కుమార్తె కవిత, అల్లుడు ఆనంద్, మనుమరాలు రమ్య (20), మనుమడు వీరేంద్రన్‌ (15), రమ్య స్నేహితురాలైన చెన్నై నంగనల్లూరుకు చెందిన భార్గవి (23)లతో ఈనెల 16వ తేదీన రెండు కార్లలో బయలుదేరారు. సుభాష్‌ చంద్రబోస్, లక్ష్మిప్రియ, కవిత, ఆనంద్‌ ఒకకారులో ఎక్కగా చెన్నైకి చెందిన చంద్రన్‌ డ్రైవర్‌ ఈ కారును నడిపాడు. అలాగే మరో కారులో వెనుక సీటులో రమ్య, భార్గవి, ముందు సీటులో వీరేంద్రన్‌ ఎక్కగా తిరుచ్చిరాపల్లికి చెందిన జోస్వ (30)అనే వ్యక్తి కారును నడిపాడు.

చెన్నై నుంచి విరుదనగర్, మదురైజిల్లాల్లోని ఆలయాలను సందర్శించుకుని శుక్రవారం రాత్రి 7 గంటలకు మదురై నుంచి తిరుచెందూరుకు ప్రయాణమయ్యారు. అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో రమ్య, భార్గవి ప్రయాణిస్తున్న కారును తూత్తుకూడి స్టెర్‌లైట్‌ కంపెనీకి సమీపంలోని ఫ్‌లైఓవర్‌పై వెళుతుండగా మదురై వైపు వెళుతున్న కంటైనర్‌ లారీ అతివేగంగా ఎదురుగా వచ్చి ఢీకొంది. దీంతో కారు ముందుభాగం సగభాగానికి పైగా లారీ కిందకు దూసుకెళ్లడంతో రమ్య, భార్గవి, వీరేంద్రన్, డ్రైవర్‌ జోస్వ శరీరాలు ఛిద్రమై సంఘటన స్థలంలోనే మృతిచెందారు. బాలుడు వీరేంద్రన్‌ మృతదేహం లారీ ముందుభాగంలో ఇరుక్కుపోవడంతో జేసీబీని రప్పించి సుమారు నాలుగు గంటలు శ్రమించి బయటకు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న  పోలీసులు మృతదేహాలను తూత్తుకూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కంటైనర్‌లారీ డ్రైవర్‌ చంద్రశేఖర్‌ను సిప్‌కాట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కోట్లు కుమ్మరిస్తా ప్రాణాలు కాపాడండి.. 
ప్రమాదానికి గురైన కారు ఎంతకూ రాకపోవడంతో తమ కారును వెనక్కి మళ్లించిన సుభాష్‌చంద్రబోస్‌ ప్రమాదస్థలిని చేరుకుని హతాశులైనారు. నెత్తుటి మడుగులో విగతజీవులై పడి ఉన్న రమ్య, వీరేంద్రన్, భార్గవిల మృతదేహాలను చూసి విలవిలలాడిపోయారు. నడిరోడ్డుపై గుండెలవిసేలా రోదించించడం సహాయక చర్యల్లో ఉన్న వారందరినీ కంటతడిపెట్టించింది. పోస్టుమార్టం జరుగుతున్న ఆసుపత్రికి చేరుకున్న సుభాష్‌చంద్రబోస్‌ ‘నాకు ఐదువేల కోట్లరూపాయల ఆస్తి ఉంది, ఒక్కో డాక్టర్‌కు రూ.5 కోట్లు ఇస్తాను, బిడ్డలను కాపాడండి’ అంటూ వైద్యుల చేతులు పట్టుకుని బ్రతిమాలడం అందరి గుండెలను బరువెక్కించింది. నలుగురూ సంఘటన స్థలంలోనే మృతి చెందారని వైద్యులు ఆయనకు నచ్చజెప్పారు.  

మరిన్ని వార్తలు