పండగ పూట విషాదం

15 Jan, 2019 07:46 IST|Sakshi
రణస్థలం: మృతుడు జగన్నాథరాజు

వేర్వేరు చోట్ల నలుగురు మృతి

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబ సభ్యులు

శ్రీకాకుళం, రణస్థలం: అందరూ పండగ ఆనందంలో ఉండగా ఆ కుటుంబాలు మాత్రం విషాదంలో మునిగిపోయాయి. జిల్లాలో వేర్వేరు చోట్ల నలుగురు మృత్యువాతపడటంతో బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రణస్థలం మండలంలోని దేరసాం గ్రామానికి చెందిన పిల్లా రామకృష్ణ (45) సోమవారం ద్విచక్ర వాహనంపై వెళ్తూ వెంకటరావుపేట సమీపంలో తోటపల్లి కాలువ వద్ద అదుపుతప్పి బోల్తాపడ్డాడు. ఈ ఘటనలో బలమైన గాయాలు తగలడంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాలువ పనుల్లో భాగంగా తవ్విన గోతులను సక్రమంగా పూడ్చకపోవడంతో గతుకుల్లో అదుపుతప్పి బైకు బోల్తాపడినట్లు స్థానికులు చెబుతున్నారు. రామకృష్ణకు భార్య నారాయణమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  జె.ఆర్‌.పురం ఎస్‌ఐ బి.అశోక్‌బాబు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం మున్సిపాలిటీలోని పురుషోత్తపురం పాత చెక్‌పోస్టు సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని గోపాలపురం వద్ద  దురా గ్రామానికి చెందిన ఏసీ మెకానిక్‌ కొయిరెడ్ల ధర్మరాజు(30) బరంపురం నుంచి ఇచ్ఛాపురం వైపు వస్తుండగా పురుషోత్తపురం పాత చెక్‌పోస్టు సమీపంలో అదే మార్గంలో బ్యాక్‌ చేస్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ధర్మరాజును హైవే అంబులెన్స్‌లో ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో బరంపురం పెద్దాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ధర్మరాజు సోదరుడు కొయిరెడ్ల లింగరాజు రెడ్డి ఫిర్యాదు మేరకు పట్టణ హెచ్‌సీ వాసుదేవరావు కేసు నమోదు చేశారు.

పురుగు మందు తాగి వ్యక్తి అత్మహత్య
రణస్థలం: మండలంలోని నారువ పంచాయతీ లోవ గ్రామానికి చెందిన కె.జగన్నాథరాజు(40) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డాడు. జగన్నాథరాజు భార్య లక్ష్మీ, జె.ఆర్‌.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథరాజు కడుపు నొప్పి భరించలేక ఇంటి సమీపంలోనే పురుగుల మందు తాగాడు. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడ్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున జగన్నాథరాజు మరణించాడు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్‌.పురం ఎస్సై బి.అశోక్‌బాబు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
పోలాకి: మండలంలోని డీఎల్‌పురం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బమ్మిడి దానయ్య(32) సోమవారం ఉదయం విశాఖలోని కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బెలమర పంచాయతీ పాలవలస గ్రామానికి చెందిన దానయ్య  కొంతకాలంగా డీఎల్‌పురం సమీపంలోని రొయ్యిలచెరువుల్లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి చెరువుల వద్దకు వెళ్తుండగా బైక్‌ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సోమవారం సాయంత్రం మృతుని కుటుంబ సభ్యులు పోలాకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువుల యజమాని బాధితులకు అందుబాటులో లేనట్లు సమాచారం.

మరిన్ని వార్తలు