ఠారెత్తించిన నరరూప రాక్షసులు

4 Mar, 2019 07:13 IST|Sakshi
హత్య, లైంగికదాడి కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ రవిప్రకాష్, చిత్రంలో డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ విల్సన్‌

కన్ను పడిందో లైంగికదాడే

శ్రీధరణి హత్య కేసు ఛేదించిన పోలీస్‌

దండుపాళ్యం తరహా నలుగురి గ్యాంగ్‌ అరెస్ట్‌

ఏపీ, తెలంగాణలో నాలుగు జిల్లాల్లో ఘటనలు

2017 డిసెంబర్‌ నుంచి 32 లైంగిక దాడులు, 4 హత్యలు

వివరాలు వెల్లడించిన ఎస్పీ రవిప్రకాష్‌

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: సంచలనం రేపిన శ్రీధరణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు నిందితులు చెబుతున్న విషయాలు కళ్లు బైర్లు కమ్మేలా చేశాయి. ఈ కేసులో నిందితులు నరరూప రాక్షసులని సాక్షాత్తు  పోలీసు అధికారులే చెప్పే స్థాయిలో నిందితుల ఘాతుకాలు ఉన్నాయి. దండుపాళ్యం సినిమాను తలపించేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో అరాచకాలు చేసిన నలుగరు గ్యాంగ్‌ను ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆదివారం ఏలూరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో డీఎస్పీ మురళీకృష్ణతో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..
శ్రీధరణి, నవీన్‌ ఇద్దరూ బౌద్ధారామాల పర్యాటక కేంద్రానికి ఈ నెల 24 ఉదయం 10.30 గంటలకు వెళ్లారు. వారిద్దరూ కొండ పైభాగం నుంచి సుమారు 500 మీటర్ల మేర లోపలికి ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశంలోకి వెళ్లారు. యువ జంటల కోసం వేచి చూస్తున్న నిందితులు కృష్ణాజిల్లా మైలవరం సంద్రాల గ్రామానికి చెందిన పొట్లూరి అంకమరావు అలియాస్‌ రాజు (28), జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సోమయ్య (22), తుపాకుల గంగయ్య (20), మాణికం నాగరాజు (20) ఆ ప్రేమజంట ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ముందుగా నవీన్‌ను రాజు కర్రతో తలపై బలంగా కొట్టాడు, మరో ఇద్దరు కర్రతో దాడి చేశారు. నవీన్‌ తలకు తీవ్రగాయం కావటంతో స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం శ్రీధరణిపై రాజు లైంగిక దాడి చేశారు. అత్యాచారం చేసిన తరువాత తనను వదిలిపెట్టాలని ఆమె కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వాళ్లు కనికరించలేదు. వదిలేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే భయంతో శ్రీధరణిని కర్రతో తలపై బలంగా కొట్టటంతో ఆమె మృతిచెందింది. మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగిన ఈ ఘటన సమయంలో సెక్యూరిటీ వస్తున్నట్టు అలికిడి రావటంతో నిందితులు పారిపోయారు.

కేసును ఛేదించింది ఇలా..  
ఎస్పీ ఆదేశాల మేరకు తడికలపూడి ఎస్‌ఐ సతీష్‌కుమార్,  చింతలపూడి సీఐ విల్సన్, భీమడోలు సీఐ కొండలరావు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న నవీన్‌ను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐపీసీ 302, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ఏఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీ మురళీకృష్ణ, సీఐలు కొండలరావు, విల్సన్‌ ఆధ్వర్యంలో ఆరు బృందాలు ముమ్మరంగా గాలించాయి. బౌద్ధారామం సెక్యూరిటీ గార్డులు, పరిసర గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, మామిడితోటల కాపలాదారులు ఇలా అందరి నుంచి వివరాలు సేకరించారు. వేటగాళ్ళ మాదిరిగా ఉన్నారని వారంతా చెప్పిన ఆనవాళ్ళు ఒకటే కావటంతో ఆదిశగా దర్యాప్తు చేశారు. ఈ ప్రాంతంలో 30 మంది వరకూ పిట్టలు కొట్టేవారు ఉన్నారనీ తెలుసుకున్నారు.  వారిలో 12 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. చివరికి అనుమానితుడుగా ఉన్న అంకమరావు అలియాస్‌ రాజును అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన ముగ్గురూ బయటకు వచ్చారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.

దండుపాళ్యం తరహా గ్యాంగ్‌
శ్రీధరణి హత్య, లైంగికదాడి కేసులో నిందితులైన నలుగురు వ్యక్తులను విచారణ చేయగా  పోలీసులకు విస్తుగొలిపే వాస్తవాలు తెలిసాయి. ప్రధాన నిందితుడు పొట్లూరి అంకమరావు తొలుత 2017 డిసెంబర్‌ లో ఒక యువ జంటపై లైంగికదాడి చేయటంతోపాటు వారినుంచి డబ్బు లాక్కున్నాడు. మరోసారి ఇదే తరహాలో ప్రేమ జంటపై దాడి చేశాడు. వీరెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటంతో అదే అదనుగా తీసుకున్నారు. తన బావమరుదులైన తుపాకుల సోమయ్య, గంగయ్య, మాణికం నాగరాజుతో కలిసి దండుపాళ్యం గ్యాంగ్‌గా మారిపోయారు. రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తెలంగాణ ఖమ్మం జిల్లాల్లో ఈ తరహాలో యువ జంటలను టార్గెట్‌ చేస్తూ దాడులకు పాల్పడడం, విచక్షణారహితంగా కొట్టి, లైంగికదాడులు చేస్తూ వచ్చారు.

కన్ను పడిందో..కాటికి పోవాల్సిందే...
నరరూప రాక్షసులుగా మారిన ఈ నలుగురు గ్యాంగ్‌ ...అందమైన యువతులను టార్గెట్‌గా చేస్తారు. బౌద్ధారామాల వంటి పర్యాటక ప్రాంతాలు, పార్కులు, తోటలు వంటి ప్రాంతాల్లో రెక్కీ చేస్తుంటారు. అంకమరావు కన్ను పడిందా.. ఇక కాటికి పోవాల్సిందేనని పోలీసులు అన్నారు. మూడు, నాలుగు జంటలు ఉంటే వాటిలో అందమైన యువతులను లక్ష్యంగా చేసుకుని యువకుడిని చావగొడతారు. అనంతరం యువతితో కామవాంఛ తీర్చుకుంటారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, డబ్బును దొంగిలించుకుపోతారు. ఇలా నాలుగు జిల్లాల పరిధిలో 2017 నుంచీ సుమారు 32 మంది యువతులపై లైంగిక దాడులకు తెగబడ్డారు. ఇక నాలుగు హత్యలు కూడా చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. వారు విచక్షణారహితంగా జంతువులను వేటాడినట్లు యువకులపై దాడి చేయటంతో ముగ్గురు యువకులు మృతిచెందారు. ఇక జిల్లాలో శ్రీధరణి హత్య నాలుగవది. 7 కేసులు నమోదయ్యాయి. వీటిలో కృష్జా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒకటి, నూజివీడులో రెండు, ఖమ్మంలో ఒకటి, గుంటూరు జిల్లాలో ఒకటి, పశ్చిమలో రెండు కేసులు నమోదు అయ్యాయి. 2017 డిసెంబర్‌ నుంచీ మొదలు పెట్టిన ఈ దాడులు ప్రతి 10 రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటున్నారు. నెల, రెండు నెలలు దాడులకు విరామం ఇస్తూ మళ్ళీ వరుసగా లైంగిక దాడులకు తెగబడేవారు.

మరిన్ని వార్తలు