వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ఆత్మహత్య

20 Dec, 2019 07:36 IST|Sakshi
గజేందర్‌ (ఫైల్‌) ధనలక్ష్మి (ఫైల్‌) ,సౌమ్య మృతదేహం

నగరంలో వేర్వేరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. జీవితంపై విరక్తితో వృద్ధుడు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా హోంగార్డు, అత్తింటి వేధింపులు తాళలేక గర్భిణి,  కుటుంబ గొడవలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నారు.

జీవితంపై విరక్తితో వృద్ధుడు..
అమీర్‌పేట: అనారోగ్యం కారణంగా ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు తెలిపిన మేరకు..  బల్కంపేట బీకేగూడకు చెందిన చంటి (60) టిఫిన్‌ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్నాడు. దీని కారణంగా రెండు కాళ్లు దెబ్బతిన్నాయి. బుధవారం  అర్ధరాత్రి  దోతితో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని కేసునమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా హోంగార్డు..
హస్తినాపురం: కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ హోంగార్డు ఫ్యాన్‌కు  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వనస్థలిపురం పోలీసులు తెలిపిన మేరకు.. వైదేహీనగర్‌ కాలనీలో నివాసముంటున్న హోంగార్డు గజేందర్‌(33) కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలినుంచి గడియపెట్టుకుని ఫ్యాన్‌కు టవల్‌ తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారమందించారు.  మృతదేహాన్ని పోస్టు మార్టమ్‌ నిమిత్తం ఉస్మానియా మార్చురికి తరలించి దర్యాఫ్తు చేస్తున్నారు.

అత్తింటి వేధింపులు తాళలేక గర్భిణి..
గోల్కొండ: అదనపు కట్నం వేధింపుల కారణంగా ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గురువారం గోల్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. షేక్‌పేట్‌కు చెందిన సౌమ్య(18)కు  7 నెలల క్రితం ఫిల్మ్‌నగర్‌కు చెందిన శివకుమార్‌తో వివాహమైంది. అయితే  భర్త శివకుమార్‌ తన తల్లి రుక్మమ్మతో కలిసి పుట్టింటి నుంచి డబ్బులు తేవాలంటూ డిమాండ్‌ చేయడం ప్రారంభించారు. కొంత కాలం నుంచి ఆమెను తల్లి కొడుకులు శారీరకంగా, మానసికంగా హింసించడం ప్రారంభించారు. సౌమ్య గర్భం దాల్చగానే ఈ వేధింపులు మరింత పెరిగాయి. ఈ వేధింపులను భరించలేక సౌమ్య గత నెల రోజుల క్రితం షేక్‌పేట్‌లోని తన పుట్టింటికి వచ్చేసింది. ఇదిలా ఉండగా గురువారం తన గదిలో చున్నీతో సౌమ్య సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. సౌమ్య ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గదిలోకి వచ్చి చూడగా అప్పటికే ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అప్పటికే మృతి చెందిన సౌమ్య మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

కుటుంబ కలహాలతో  మహిళ..
కుత్బుల్లాపూర్‌: కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ గుర్తుతెలియని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు తెలిపిన మేరకు.. కుత్బుల్లాపూర్‌ భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన  మగ్దం ధనలక్ష్మి (30), రాంబాబు దంపతులకు ఆరునెలలుగా మనస్పర్దలున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ధనలక్ష్మి ఈ నెల 18న సాయంత్రం గుర్తు తెలియని మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబసభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు సిబ్బంది ధ్రువీకరించారు. మృతురాలి సోదరి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా