ప్రాణాలు తీసిన లారీ వేగం

12 Dec, 2019 09:04 IST|Sakshi
భార్యాపిల్లలతో హారున్‌బాషా (ఫైల్‌)

వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఘోర ప్రమాదం, నలుగురి మృతి

మృతుల్లో జిల్లాకు చెందిన యువ దంపతులు

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా రామాపురం మండలం కొండావాండ్లపల్లె వద్ద మంగళవారం అర్ధరాత్రి తర్వాత లారీ ఢీకొనడంతో కలికిరి మండలం గుట్టపాళ్యెంకు చెందిన యువ దంపతులు షేక్‌ హారున్‌బాషా(30), షేక్‌ హసిరా బేగం(28) దుర్మరణం పాలయ్యారు. వారితో పాటు షేక్‌ హారున్‌ బాషా అత్త హజిరాబేగం (52), కారు డ్రైవర్‌ హర్షద్‌ఖాన్‌(37) మత్యువాత పడ్డారు. ఈ సంఘటనతో గుట్టపాళెం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా ఈ ప్రమాదంలో హారూన్‌బాషా, హసిరాల ఇద్దరు బిడ్డలు మాత్రం ప్రాణాలతో బయటపడడం విశేషం.

రాయచోటి/కలికిరి : అర్ధరాత్రి దాటాక వరుసగా జరుగుతున్న ప్రమాదాల జాబితాలో మరొకటి చేరింది. వైఎస్సార్‌ జిల్లా రామాపురం మండలం కొండావాండ్లపల్లె వద్ద మంగళవారం అర్ధరాత్రి తర్వాత లారీ ఢీకొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి పూట రహదారిపై మితిమీరిన వేగంతో లారీ రావడం..మంచు వల్ల మార్గం సరిగా కనిపించకపోవడం ఫలితంగా ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.  రాయచోటికి చెందిన పైపుల పరిశ్రమ యజమాని షేక్‌ఖాదర్‌ మోహిద్దీన్‌  తన భార్య హజిరాబేగం, ఇద్దరు కుమారులు, కుమార్తె, అల్లుడు, మనవళ్లతో కలిసి ఇన్నోవా వాహనంలో మంగళవారం ఉదయం ప్రొద్దుటూరు వెళ్లారు. అమెరికాలో ఉండే చిన్న కుమార్తె, అల్లుడు ఈ మధ్యనే ప్రొద్దుటూరుకు వచ్చారు.

వారిని చూసేందుకు వీరంతా వెళ్లారు. సాయంత్రం వరకు అందరూ ఆనందంగా గడిపారు. రాత్రి భోజనం చేసి 10.30 గంటల సమయంలో రాయచోటికి తిరుగు ప్రయాణమయ్యారు. కడప మీదుగా రాయచోటిలోని స్వగృహానికి మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో మితిమీరిన వేగంతో వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొంది. డ్రైవర్‌తో సహా నలుగురు అక్కడికక్కడే అశువులు బాశారు. చిన్నారులతో కలిసి 11 మంది ఇన్నోవాలో ప్రయాణిస్తున్నారు. మొహిద్దీన్‌ భార్య హజిరాబేగం(52)లతో పాటు కుమార్తె హసిరా(31) అల్లుడు హరూన్‌బాషా(35)  ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్‌ హర్షద్‌ఖాన్‌(37) కూడా దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన హరూన్‌ బాషా కలికిరి మండలం గుట్టపాలెంకు చెందిన వారు. ఈయన సదుం మండలంలో వ్యవసాయ విస్తరణాధికారిగా పని చేస్తున్నారు. కుటుంబంతో పీలేరులో నివసిస్తున్నారు. హారున్‌బాషా దంపతుల మృత దేహాలు బుధవారం సాయంత్రం గుట్టపాలెం చేరాయి. గురు వారం అంత్య క్రియలు నిర్వహిస్తారు.

అమ్మ ఒడిలో ఒకరు..అమ్మమ్మ ఒడిలో మరొకరు సురక్షితం
సంఘటనలో ప్రాణాలను కోల్పోయిన హరూన్‌బాషా, అతని భార్య హసిరాల పిల్లలు మాత్రం ప్రాణాలతో బయటపడడం విశేషం! వీరిరువురు అమ్మ ఒడిలో ఒకరు, అమ్మమ్మ ఒడిలో మరొకరు ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. అమ్మ, అమ్మమ్మలు ఇరువురూ మృతి చెందగా వారి ఒడిలో ఉన్న చిన్నారులు క్షేమంగా బయట పడ్డారు. చిన్నవయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన వీరిని చూసి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతుడు డ్రైవర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

మరిన్ని వార్తలు