నలుగురు విద్యార్థుల ఆత్మహత్య

14 Apr, 2018 02:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామని ముగ్గురు, మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు వెరసి నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఇంటర్‌ ఫలితాలు వచ్చిన కొద్దిసేపటికే సిటీలో ఈ విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి.  
వనస్థలిపురం సుభద్రానగర్‌కు చెందిన ఎ.ఉదయ మాణిక్య వరప్రకాశ్‌ కుమార్తె వందన దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫలితాల్లో 440కి 325 మార్కులే వచ్చాయని మనస్తాపానికి గురైన వందన బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.  
కూకట్‌పల్లి పరిధి ఖైత్లాపూర్‌లో ఉండే కాట్రాజ్‌ శేఖర్‌ కుమారుడు సాయికుమార్‌ (17) ఎంఎన్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఇతడు ఫెయిలయ్యాడు. మనోవేదనకు గురైన సాయికుమార్‌ను తల్లిదండ్రులు ఓదార్చి మళ్లీ రాసి పాస్‌ కావచ్చని చెప్పి విధులకు వెళ్లారు. మధ్యాహ్నం సాయికుమార్‌ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పిర్జాదిగూడ మల్లికార్జున్‌ నగర్‌లో నివసించే దూలం మధు కుమార్తె వర్ష (16) ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలు రాసి, అన్ని సబ్జెక్ట్‌లూ తప్పింది. దీంతో మనస్తాపం చెందిన వర్ష ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
గాజులరామారం ఉషోదయ కాలనీకి చెందిన మువ్వ రామకృష్ణ కుమార్తె శ్రీవిద్య (18) చింతల్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్‌ ఎంపీసీ మొదటి సంవత్సరం పరీక్షలు రాసింది. ఫలితాల్లో ఆమె నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిలైన విషయం తెలిసి, వారు నివాసముండే అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకేసింది. అక్కడికక్కడే మృతి చెందింది.

మరిన్ని వార్తలు