కావేరిలో విషాదం

19 Dec, 2017 09:32 IST|Sakshi

సెలవు రోజున సరదాగా గడిపేందుకు వెళ్లిన నలుగురు బాలమిత్రులు కన్నవారికి కడుపు కోత మిగిల్చారు. ఆదివారం సాయంత్రం నుంచి కనబడకపోతే ఉదయాన్నే వస్తారనుకున్న ఆ తల్లిదండ్రులను కన్నీటి సంద్రంలో ముంచేశారు. పక్షులు పట్టడానికి వెళతామని ఇంట్లో చెప్పి కావేరి నదిలో మృతదేహాలుగా కనిపించారు. ఈత కొట్టేందుకు వెళ్లి ఆ బాలురు మునిగిపోయారా.. లేక రసాయన వ్యర్థాల ప్రభావంతో చనిపోయారా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. 

సాక్షి, సేలం: మెట్టూరు డ్యాం వద్ద కావేరి నదిలో సరదాగా ఈత కొట్టడానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు సహా నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. వివరాలు.. సేలం జిల్లా మేట్టూరు సమీపం సేలం క్యాంప్‌ అన్నానగర్‌ ప్రాంతానికి చెందిన కూలీ ధనపాల్‌. ఇతని కుమారులు రాజా (12), తమిళలగన్‌ (9) అదే ప్రాంతంలో ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి, నాలుగో తరగతి చదువుతున్నారు. అదే పాఠశాలలో మణి కుమారుడు మోహన్‌ రాజ్‌ (7) రెండో తరగతి, బాలాజీ కుమారుడు మణికంఠన్‌ (17) పదో తరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటున్నాడు. 

ఈ నలుగురు స్నేహితులు ఆదివారం సెలవు కావడంతో పక్షులను పట్టడానికి వెళుతున్నామని తెలిపి బయటకు వెళ్లారు. అయితే పొద్దుపోయినా వారు నలుగురు ఇంటికి చేరుకోలేదు. తల్లిదండ్రులు అనేక ప్రాంతాల్లో గాలించినా వారి ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో మెట్టూరులో 16 గేట్ల ఉపరి నీరు వెలువడే ప్రాంతంలో రసాయన వ్యర్థపు నీరు నిల్చి ఉంటుంది. ఈ ప్రాంతంలో సోమవారం ఉదయం నలుగురి మృత దేహాలు తేలుతూ కనిపించాయి. విషయం తెలుసుకున్న వారి కుటుంబీకులు బోరున విలపించారు. 

సమాచారం అందుకున్న కరుమలైకూడల్‌ పోలీసులు, మెట్టూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురి మృత దేహాలను వెలికి తీసి శవపంచనామా నిమిత్తం మేట్టూరు జీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, ప్రాథమిక విచారణలో సరదాగా ఈత కొట్టడానికి నీటిలో దిగి ఉంటారని తెలిసింది. అయితే విద్యార్థుల మృతదేహాలు లభించిన ప్రాంతంలో లోతుగా లేకపోవడంతో చిన్నారుల మృతికి గల కారణలపై దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ నిలిచిఉన్న రసాయన వ్యర్థపు నీటి వల్ల మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడకు రసాయన వ్యర్థపు నీరు ఏఏ సంస్థల నుంచి వచ్చి చేరుతుంది. రసాయనాల కారణంగానే నలుగురు బాలురు మృతి చెందారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
 

మరిన్ని వార్తలు