అనుమానాస్పద స్థితిలో నలుగురు యువకులు మృతి

22 Dec, 2018 02:56 IST|Sakshi
గదిలో మృతిచెందిన నలుగురు యువకులు , మహేశ్‌ ముదిరాజ్, సతీశ్‌గౌడ్, అరవింద్‌గౌడ్, మహేందర్‌రెడ్డి

పౌల్ట్రీఫామ్‌ లీజుకు తీసుకున్న యువకులు 

బొగ్గుల కుంపటే మృతికి కారణమని అనుమానిస్తున్న పోలీసులు 

మేడ్చల్‌ జిల్లా, శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘటన

శామీర్‌పేట్‌/తొర్రూరు రూరల్‌ (పాలకుర్తి): తమ కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలనుకున్న నలుగురు యువకుల లక్ష్యం నెరవేరకుండానే జీవితాన్ని చాలించారు. మహబూబాబాద్‌ జిల్లా నుంచి మెదక్‌ జిల్లాకు వలస వచ్చి తాము లీజుకు తీసుకున్న ఫౌల్ట్రీ ఫామ్‌లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరి హృదయాల్ని కలచివేస్తోంది. స్వయం ఉపాధి ద్వారా నలుగురుకీ ఊరి లో ఆదర్శంగా నిలుస్తారనుకున్న ఆ యువకుల అకాల మరణం గ్రామస్తుల్ని విషాదంలో నింపింది. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బొమ్మరాశిపేట శివారు కేజీఎల్‌ పౌల్ట్రీఫామ్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా, తొర్రూరు మండలం, వెంకటాపూర్‌కు చెందిన గాదగాని వెంకన్న, అరుణ దంపతుల రెండో కుమారుడు అరవింద్‌గౌడ్‌(23), మొగుళ్ల వెంకన్న, సోమనర్సమ్మ దంపతుల కుమారుడు శివశంకర్‌గౌడ్‌(21)లు శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటలో నెల క్రితం సుధాకర్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీఫామ్‌ను లీజుకు తీసుకుని కోళ్ల పెంపకం చేపట్టారు. వీరికి తోడుగా ఉండేందుకు వారి స్వగ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీను, సుభద్ర దంపతుల కుమారుడు మహేశ్‌ ముదిరాజ్‌(22)ను వారం రోజుల క్రితం తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నారు. కాగా, ఈ ముగ్గురినీ కలిసేందుకు వీరి స్నేహితుడు పోరెడ్డి మహేందర్‌రెడ్డి(25) వెంకటాపురం నుంచి గురువారం బొమ్మరాశిపేటకు వచ్చాడు. రాత్రి సుమారు 1 గంట వరకు వీరంతా కోడిపిల్లలకు వాక్సిన్‌ వేశారు.

అనంతరం భోజనం చేసి పక్కనే ఉన్న గదిలో పడుకున్నారు. ఉదయం 11 గంటలకు కేజీఎల్‌(అభ్యుదయ) కంపెనీ సూపర్‌వైజర్‌ సతీశ్‌ కోడిపిల్లల పరిశీలనకు పౌల్ట్రీఫామ్‌ దగ్గరకు వచ్చాడు. కోడిపిల్లలకు నీరు కూడా పెట్టలేదని గమనించిన సతీశ్‌ యువకులు నిద్రించిన గది వద్దకు వెళ్ళి వారిని పిలవగా ఎవరూ స్పందించలేదు. దీంతో సతీశ్‌ తలుపు నెట్టుకుని లోపలికి వెళ్లగా నలుగురు యువకులు మృతిచెందినట్టు కన్పించారు. వెంటనే పోలీసులకు, బంధువులకు సమాచారం అందించాడు. పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ శ్రీనివాసరావు, శామీర్‌పేట సీఐ నవీన్‌రెడ్డిలు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. చలికాచుకునేందుకు ఏర్పాటు చేసుకున్న బొగ్గుల కుంపటే వీరి మృతికి కారణమై ఉంటుందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకులు మరణించడంతో తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు గాంధీ ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించి బాధిత కుటుంబాలను ఓదార్చారు.  

నివేదిక అనంతరమే..  
ఈ యువకుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బొగ్గుల కుంపటి వల్లే ఊపిరాడక చనిపోయి ఉంటారని కొందరు, కోడి పిల్లలకిచ్చే వ్యాక్సిన్‌ ద్రావణం ఆహారంలో కలవడం వల్లేనని, వీరంటే గిట్టని వారెవరో ఆహారంలో విషం కలిపి ఉంటారన్న మరికొందరు అభిప్రాయపడుతున్నారు. వీరి మృతికి విషాహారమా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్నది పోస్టుమార్టం నివేదిక అనంతరం తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు