నాలుగేళ్లకే నూరేళ్లు నిండాయి

18 Oct, 2017 09:39 IST|Sakshi
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మద్దికొండ అలకనంద

జ్వరంతో నాలుగేళ్ల బాలిక మృతి

మలేరియా, టైఫాయిడ్, డెంగీ ఉన్నట్టు ప్రభుత్వాస్పత్రిలో నిర్థారణ

నాలుగు రోజులు చికిత్స చేసినా నిలవని ప్రాణం

కలెక్టర్‌ సారూ... నా వయసు నాలుగేళ్లే...ఇప్పుడిప్పుడే లోకం తెలుసుకుంటున్న సమయంలోనే నా శ్వాస ఆగిపోయింది. మా ఏజెన్సీప్రాంతంలో అమ్మ ఒడికి చేరకుండానే అకాలంగా మృత్యు కౌగిల్లోకి చేరిపోయిన ఎంతో మందిలానే నేను కూడా. జిల్లా కేంద్రమైన కాకినాడలో బతికిస్తారేమో... అమ్మ చెంత పెరిగి... నాన్న భుజాలపైకెక్కి ఈ లోకాన్ని చూస్తాననుకున్నా... జీవితంలో పైకెదుగుతాననుకున్నా... ఆ ఆశ అడియాసైంది... నా ప్రాణయాత్ర ఆగిపోయింది.

అడ్డతీగల (రంపచోడవరం): తీవ్ర జ్వరంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామానికి చెందిన మద్దికొండ అలకనంద (4) అనే బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. ఐదు రోజుల క్రితం జ్వరం తీవ్రంగా రావడంతో తమ కుమార్తెను తొలుత కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు మృతురాలి తండ్రి ఆనంద్‌ తెలిపారు. రెండు రోజుల అనంతరం తాము ఇక చికిత్స చేయలేమని, ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమన్న అక్కడి వైద్యుల సూచన మేరకు కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లామని వివరించారు. మూడు రోజులుగా చికిత్స చేస్తున్నారని, బాలికకు మలేరియా, టైఫాయిడ్, డెంగీ ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించి చికిత్స అందించినా ఫలితం లేకపోయిందని, సోమవారం రాత్రి చనిపోయిందని ఆ తండ్రి కన్నీళ్ల పర్యంతమయ్యారు.

మరిన్ని వార్తలు