మీ ఉంగరం దేవుడి దగ్గరకు వెళ్లింది

29 May, 2019 07:03 IST|Sakshi

బాబా భక్తుల ముసుగులో టోకరా

దృష్టి మరల్చి బంగారు ఉంగరం చోరీ

రాంగోపాల్‌పేట్‌: బాబా భక్తులమంటూ బాబా ఫొటో చేతిలో పెట్టి ఓ గుజరాత్‌ ముఠా బంగారు ఉంగరం నొక్కేసింది.మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బొల్లారం ప్రాంతానికి చెందిన లక్ష్మణ్‌ ఈ నెల 26న రిమోట్‌ కొనుగోలు చేసేందుకు ఆర్పీరోడ్‌కు వచ్చాడు. ఆర్పీరోడ్‌లోని కింగ్స్‌వే హైస్కూల్‌ వద్ద కారులో కూర్చుని ఉండగా ముగ్గురు వ్యక్తులు సాయిబాబా ఫొటోతో అక్కడికి వచ్చి తాము బాబా భక్తులమని ఏదైనా సహాయం చేయాలని కోరారు.

దీంతో లక్ష్మణ్‌ రూ.60 వారికి ఇవ్వబోగా ‘మీ చేతికి ఉంగరం ఉంది ఉంగరం ఉన్న చేతితో దానం స్వీకరించం’ అని చెప్పారు. దీంతో ఆయన ఉంగరం చేతిలో పెట్టుకుని డబ్బుతో పాటు ఉంగరాన్ని వారి చేతిలో పెట్టాడు. వెంటనే ఉంగరాన్ని చేతితో తీసుకుని చుట్టూ తిప్పి నోట్లో వేసుకున్నట్లు నటించాడు. లక్ష్మణ్‌ చేతిలో బాబా బొమ్మ పెట్టి వెళ్లిపోతుండగా ఉంగరం ఇవ్వమని కోరాడు. ‘మీ ఉంగరం  బాబా దగ్గరకు వెళ్లింది. దానం చేసిన తర్వాత మళ్లీ ఎలా అడుగుతారు అని దబాయిస్తూ అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో లక్ష్మన్‌ కారు దిగి వారి కోసం గాలించగా గల్లీల్లోనుంచి వెళ్లిపోయారు. దీంతో అతను  మహంకాళి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఉంగరం సుమారు తులం బరువు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గుజరాత్‌ ముఠా పనే?
సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించన పోలీసులు నిందితులు గుజరాత్‌ ముఠాగా భావిస్తున్నారు. రంజాన్‌ సమయంలో వారు భిక్షాటన చేస్తున్నట్లు నటించి దృష్టి మరల్చి చోరీలకు పాల్పడతారన్నారు. ముగ్గురు నిందితుల్లో ఒక బాలుడు కూడా ఉన్నట్లు తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు