ఆసుపత్రుల వద్ద తిష్టవేసి.. మోసాలు

23 Jul, 2020 08:43 IST|Sakshi
నిందితుని వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌

ఆసుపత్రుల వద్ద తిష్టవేసి.. మోసాలు

పంజగుట్ట: ‘‘మా అమ్మకు సీరియస్‌గా ఉంది ... అర్జెంటుగా ఆసుపత్రిలో డబ్బులు కట్టాలి ... నా కార్డులు పనిచేయడంలేదు..  కొద్దిగా డబ్బులు ఉంటే సర్దండి. వెంటనే ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేస్తా’’ అని నమ్మబలికి 13 కార్పొరేట్‌ ఆసుపత్రుల వద్ద పలువురి నుంచి సుమారు రెండు లక్షల వరకూ వసూలు చేసి పారిపోయిన నిందితుడ్ని పంజగుట్ట క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం పశ్బిమ మండల డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, ఏసీపీ తిరుపతన్న, ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి, క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం...   హనుమకొండ, వికాస్‌ నగర్‌కు చెందిన కాసిడి రాజ రోహిత్‌ రెడ్డి అలియాస్‌ రోహిత్‌ అలియాస్‌ చిన్ను(27) నిరుద్యోగి. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోసాలు చేస్తున్నాడు.

నగరంలోని పలు కార్పొరేట్‌ ఆసుపత్రులను ఎంచుకుంటాడు. అక్కడ మాటువేసి తన డెబిట్, క్రెడిట్‌ కార్డులు పని చేయడం లేదని అమాయకులకు చెప్పి నగదు తీసుకుంటాడు. ఆన్‌లైన్‌లో పేమెంట్‌ చేసినట్టు నటించి తన ఫోన్‌లో ఉన్న ట్రాన్సక్షన్‌ సక్సెస్‌ అనే పాత మెసేజ్‌ను చూపించి అక్కడి నుంచి జారుకుంటాడు. ఇలా రూ.1,98,850 వరకు చీటింగ్‌ చేశాడు. పంజగుట్ట క్రైమ్‌ పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకొని రూ.30 వేల నగదు, ఓ మొబైల్‌ ఫోన్‌ స్వాధీనంచేసుకున్నారు. 

మరిన్ని వార్తలు