గుల్జార్‌ చిక్కాడు!

19 Feb, 2019 06:27 IST|Sakshi

సీసీఎస్‌ కస్టడీ నుంచి పరారైన మోసగాడు

జాబ్‌ ప్రాడ్‌ కేసులో కోల్‌కతాలో పట్టుకున్న వైనం

రైలులో తీసుకొస్తుండగా విశాఖపట్నంలో పరారీ

ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాల పేరుతో భారీ స్కామ్‌కు పాల్పడి పోలీసులకు చిక్కి, విశాఖపట్నంలో కస్టడీ నుంచి తప్పించుకున్న ఘరానా మోసగాడిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 8 నుంచి తప్పించుకు తిరుగుతున్న అతడిని ఉత్తరప్రదేశ్‌లోని దుల్హాహిపూర్‌లో మరో సారి అరెస్ట్‌ చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచిన అధికారులు ట్రాన్సిట్‌ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చి సోమవారం జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన గులాం మహ్మద్‌ ఇల్లాహి అలియాస్‌ గుల్జార్‌ నగరానికి చెందిన ఆలియా భానును వివాహం చేసుకున్నాడు. దీంతో అతగాడు కొన్నాళ్ల పాటు సిటీలోనే నివసించాడు. ఈ నేపథ్యంలో తరచూ దారుల్‌షిఫాలోని ఓ ప్రార్థనా స్థలానికి వెళ్తున్న అతడికి గత ఏడాది జనవరిలో యాకత్‌పురకు చెందిన ఉపాధ్యాయుడు ముదస్సిర్‌ అలీ తదితరులతో పరిచయం ఏర్పడింది. వీరికి మతపరమైన అంశాలను బోధించిన గుల్జార్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. తనకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి వినియోగించి రైల్వే, ఎస్బీఐ, ఎఫ్‌సీఐ తదితర సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మించాడు.

ఒక్కొక్కరి నుంచి రూ.2.5 లక్షల చొప్పున మొత్తం రూ.60 లక్షల వరకు వసూలు చేశాడు. ఆపై రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించిన అతను అందులో వీరందరి పేర్లు పొందుపరుస్తూ ఉద్యోగాలకు ఎంపికైనట్లు చూపించాడు. కొన్ని రోజుల తర్వాత వారిని కోల్‌కతాకు రప్పించి హౌరాలోని రైల్వే ఆర్థోపెడిక్‌ హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించి అందులోనూ ఉత్తీర్ణులైనట్లు చెప్పాడు. మరోసారి గత ఏడాది ఏప్రిల్‌ బాధితులను కోల్‌కతాకు తీసుకువెళ్లి అక్కడి వర్థమాన్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉంచి కొన్నాళ్ల పాటు శిక్షణ కూడా ఇచ్చాడు. ఇందుకు గాను అతను రైల్వేకు సంబంధించిన ఓ సెట్‌ను సిద్ధం చేయడం గమనార్హం. త్వరలోనే అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ వస్తాయని వాటిలో పేర్కొన్న ప్రాంతాలకు వెళ్లి రైల్వే ఉద్యోగాల్లో చేరాలని సూచించాడు. ఈ వ్యవహారాల్లో ఆలియా భాను ప్రమేయం సైతం ఉన్న ట్లు బాధితులు గుర్తించారు. జూలై 10 నుంచి గుల్జార్‌ స్పందించడం మానేయడంతో ముదస్సిర్‌ అలీ  సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత ఏడాది సెప్టెంబర్‌ 12న భార్యభర్తలపై కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు కోల్‌కతాలో ఉన్నట్లు గుర్తించారు.

వారి కోసం ఇటీవల ఓ ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లిం ది. దాదాపు వారం రోజుల పాటు ముమ్మ రంగా గాలించి గుల్జార్‌ను పట్టుకున్నారు. ఇతడిని అక్కడే అరెస్టు చేసిన పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. హైదరాబాద్‌ తరలించడానికి ట్రాన్సిట్‌ వారెంట్‌ (టీఆర్‌ నెం.12863) తీసుకున్నారు. ఈ నెల 7న రాత్రి నిందితుడితో సహా ప్రత్యేక బృందం హౌరా–యశ్వత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు బయలుదేరింది. అక్కడి నుంచి హైదరాబాద్‌ తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. 8న ఉదయం 11.15 గంటల సమయంలో ఈ రైలు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌కు చేరుకోగా అక్కడ సీసీఎస్‌ పోలీసుల కళ్లుగప్పిన గుల్జార్‌ తప్పించుకున్నాడు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టి ఉత్తరప్రదేశ్‌లోని దుల్హాహిపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. అతడిని అరెస్ట్‌ చేసి నగరానికి తీసుకువచ్చారు. ఈ ఎస్కేప్‌ ఉదంతానికి సంబంధించి విశాఖపట్నం జీఆర్పీ ఠాణాలోనూ కేసు ఉంది. 

మరిన్ని వార్తలు