మలేషియాలో ఉద్యోగాల పేరుతో టోకరా

6 Mar, 2019 10:24 IST|Sakshi
పోలీసుల అదుపులో నిందితులు

పలువురి నుంచి రూ.లక్షల్లో వసూలు

ఇద్దరిని అరెస్టు చేసిన వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: మలేషియాలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి రూ.లక్షలు వసూలు చేసిన ఇద్దరు వ్యక్తులను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరి నుంచి 15 పాస్‌పోర్టులు, మూడు ల్యాప్‌టాప్‌లు, 76 మలేషియా సిమ్‌ కార్డులు, ఎనిమిది సెల్‌ఫోన్లతో పాటు రూ.11,400 నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహర్‌కు చెందిన సౌరభ్‌ కుమార్‌ జా డిగ్రీ పూర్తి చేసి మార్కెటింగ్‌ సంస్థల్లో పనిచేసేవాడు. 2016లో ముంబైలో ఏఐఎం గ్రోత్‌ మార్కెటింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. 2018 ఏప్రిల్‌లో హైదరాబాద్‌కు వచ్చిన అతడికి నాంపల్లికి చెందిన మహమ్మద్‌ ఇబ్రహీంతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య స్నేహం కుదరడంతో మహమ్మద్‌ ఇబ్రహీం కుమార్తె అస్మా అలియాతో కలిసి అసిఫ్‌నగర్‌లో ఏఐఎం రగోత్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రారంభించాడు.

మహ్మద్‌ ఇబ్రహీం మేనేజర్‌గా, అతని కుమార్తె అలియా రిసెప్షనిస్టుగా వ్యవహరిస్తూ మలేషియాలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. దీనిని నమ్మి కన్సల్టెన్సీని సంప్రదించిన నిరుద్యోగులకు  సౌరభ్‌ కుమార్‌ ఝా, మహమ్మద్‌ ఇబ్రహీం ఇంటర్వ్యూ చేసేవారు. పాస్‌పోర్టులు, ప్రాసెసింగ్‌ ఫీజు కోసం డబ్బులు వసూలు చేసిన అనంతరం హైదరాబాద్‌ నుంచి మలేషియాకు విమాన టికెట్లు బుక్‌ చేసేవారు. మలేషియా సిమ్‌కార్డులు కూడా సమకూర్చి వారిని  విజిట్‌ వీసాపై మలేషియా పంపేవారు. బాధితులకు అక్కడికి చేరుకున్నాక తమ వ్యక్తి ఎంప్లాయిమెంట్‌ వీసా వీస్తాడని నమ్మించేవారు.

అక్కడికెళ్లిన బాధితులను వీరికి సంబంధించిన వ్యక్తి రెండు రోజులు ఉంచుకొని ఆ తర్వాత పాస్‌పోర్టులను లాక్కునేవాడు. ఇలా దాదాపు 30 నుంచి 40 మందికి ప్యాకింగ్‌ మెన్, క్లీనింగ్‌ మెన్, సేల్స్‌మెన్‌ ఉద్యోగాలు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు నెలకు ఆదాయం ఉంటుందంటూ ఒక్కొక్కరి నుంచి రూ.75,000 నుంచి రూ.1,50,000 వరకు వసూలుచేశారు. కొందరు బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సౌరభ్‌ కుమార్‌ ఝా, మహమ్మద్‌ ఇబ్రహీంలను అరెస్టు చేశారు. కేంద్ర కార్మిక శాఖ ప్రొటెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎమ్మిగ్రేషన్‌ నుంచి లైసెన్స్‌ తీసుకోకుండానే కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను అసిఫ్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు