వీసాల పేరిట రూ.3 కోట్లకు టోకరా  

16 Sep, 2019 02:49 IST|Sakshi

మోర్తాడ్‌ (బాల్కొండ): ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్‌కు పంపిస్తామని నమ్మించిన ఏజెంట్లు అమాయకులను నిండా ముంచారు. రూ.3 కోట్లకు పైగా టోకరా వేశారు. వీసాల పేరిట ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన సుమారు 50 మంది నిరుద్యోగులను వంచించారు. నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాధితుడు రాజు స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో ఇజ్రాయెల్‌ వీసాల మోసం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్‌లోని గాయత్రీనగర్, డిచ్‌పల్లి మండలం సుద్దులం గ్రామానికి చెందిన ఇద్దరు ఏజెంట్లు ఇజ్రాయెల్‌ వెళ్లడానికి వీసాలు ఇప్పిస్తామని అమాయకులను నమ్మించారు.

ఆరు నెలల కింద ఒక్కొక్కరి నుంచి రూ.6 లక్షల చొప్పున వసూలు చేశారు.  నిరుద్యోగులను ఇంటర్వ్యూల పేరిట ఢిల్లీ, బెంగళూరుకు తీసుకెళ్లి వీసాల ప్రక్రియ ప్రారంభించినట్లు నమ్మించారు.  అయితే, ఆర్నెల్లు అవుతున్నా వీసాలు ఇవ్వక పోవడంతో తాము చెల్లించిన సొమ్మును వాపసు చేయాలని కోరితే భౌతిక దాడులకు పాల్పడినట్లు బాధితులు ‘సాక్షి’వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌ వీసాల పేరిట నమ్మించి మోసగించిన ఏజెంట్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుని తమ డబ్బులు తమకు ఇప్పించాలని వారు కోరారు.  

మరిన్ని వార్తలు