బోగస్‌ ట్రావెల్‌ ఏజెన్సీ గుట్టురట్టు

31 Oct, 2019 10:32 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న స్టాంప్‌లు, నకిలీ వీసాలు, యూసుఫ్, జఫ్ఫారుద్దీన్‌

దక్షిణ కొరియాలో ఉద్యోగాలంటూ ఎర

విజిట్, టూరిస్ట్‌ వీసాలు అంటగట్టి మోసం

ఇద్దరు నిందితుల అరెస్టు  

సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి అనుమతులు లేకుండా ట్రావెల్‌ ఏజెన్సీ ఏర్పాటు చేసి, వీసా ప్రాసెసింగ్‌ సైతం నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తున్న ముఠా గుట్టును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వీరి నుంచి ల్యాప్‌టాప్, నకిలీ లెటర్‌హెడ్స్‌ తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌ బుధవారం తెలిపారు. చంపాపేట్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ యూసుఫ్‌కు విదేశాలకు వెళ్లి రావడం అంటే మక్కువ, ఈ నేపథ్యంలోనే పలుమార్లు సౌదీ అరేబియాతో పాటు దక్షిణ కొరియా వెళ్లి వచ్చాడు. అలా అతడికి ఆయా దేశాలకు సంబంధించిన వీసా ప్రాసెసింగ్‌పై అవగాహన ఏర్పడింది. ఈ విధానం సుదీర్ఘమైనవి కావడం, సాధారణ ప్రజలకు అవగాహన లేకపోవడాన్ని క్యాష్‌ చేసుకోవాలని పథకం వేశాడు. ఎలాంటి అనుమతులు లేకుండానే ట్రావెల్‌ ఏజెన్సీ, వీసా ప్రాసెసింగ్‌ ప్రారంభించిన అతను ఆయా దేశాలకు వెళ్లాలని భావించే వారికి వీసాలు ఇప్పించే వాడు.

దీనికోసం యూసుఫ్‌ నకిలీ లెటర్‌హెడ్స్, స్టాంపులు వినియోగించి వివిధ పత్రాలు తయారు చేసేవాడు. ఇంటర్‌నెట్‌ ద్వారా అధీకృత ట్రావెల్‌ ఏజెంట్ల వివరాలు తెలుసుకుని వారి పేరుతోనే వీటిని రూపొందించేవాడు. దక్షిణ కొరియాలో ఉద్యోగాలు సైతం ఇప్పిస్తానంటూ అనేక మందికి ఎర వేసిన ఇతను జాబ్‌ వీసాల పేరుతో విజిట్‌ వీసాలు ఇచ్చి పంపేవాడు. అక్కడికి వెళ్ళిన వారిని అక్రమంగా నివాసం ఉండేలా చేసి ఆపై ఏఆర్సీ కార్డు పొందడానికి ప్రాసెసింగ్‌ చేసేవాడు. చివరకు వారిని శరణార్థులుగా మార్చి అందుకు సంబందించిన  గుర్తింపు కార్డులు ఇప్పించేవాడు. ఈ వ్యవహారాల్లో ఇతడికి కాలాపత్తర్‌కు చెందిన మహ్మద్‌ జఫ్పారుద్దీన్‌ సహకరించాడు. వీరిద్దరూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసేవారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు మహ్మద్‌ థ«క్రుద్దీన్, ఎన్‌.శ్రీశైలం, వి.నరేందర్‌ వలపన్ని నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.47,500 నగదు, ల్యాప్‌టాప్, నకిలీ రబ్బర్‌ స్టాంపులు, లెటర్‌హెడ్స్‌ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వారిని శాలిబండ పోలీసులకు అప్పగించారు.  

కెనడాలో వర్క్‌పర్మిట్‌ ఇప్పిస్తానంటూ మోసం: నిందితుడిపై కేసు నమోదు
పంజగుట్ట: కెనడాలో వర్క్‌ పర్మిట్‌ ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడిన వ్యక్తిపై పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టౌలీచౌకి, సూర్యానగర్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ తబ్రేజ్‌ పాషా, నగరానికి చెందిన మహ్ముద్‌ అబ్దుల్‌ అజీజ్, మహ్మద్‌ మజార్‌ కెనడాలో వర్క్‌పర్మిట్‌ వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వాణిజ్య ప్రకటన ఆధారంగా పంజగుట్టలోని సహారా వరల్డ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ యజమాని మహ్మద్‌ తస్కిన్‌ను సంప్రదించారు. ఇందుకు గాను ఒక్కొక్కరికి రూ.7.80 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. దీంతో వారు పలు దఫాలుగా రూ.4.30 లక్షల చొప్పున చెల్లించారు. అనంతరం మొదట బ్యాంకాక్‌ వెళ్లాలని అక్కడి నుంచి 20 రోజుల్లో కెనడా వర్క్‌ పర్మిట్‌ వీసా ఇప్పిస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మి బ్యాంకాక్‌ వెళ్లిన తమకు కనీసం వసతి కూడా కల్పించలేదన్నారు. దాదాపు రెండు నెలల పాటు సొంత ఖర్చులతో అక్కడే ఉన్న తాము తస్కిన్‌కు ఫోన్‌ చేసినా స్పందించ లేదని తెలిపారు. బ్యాంకాక్‌ వీసా గడువు ముగుస్తుండడంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చినట్లు తెలిపారు. అనంతరం తస్కిన్‌ వద్దకు వెళ్లి  డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా మరో రూ.1.70 లక్షలు చెల్లిస్తే కెనడా ఎలక్ట్రానిక్‌ ట్రావెల్‌ ఆథరైజేషన్‌ (ఈటా) వీసా ఇప్పిస్తానని చెప్పాడన్నారు. తాము దీనిపై ఆరా తీయగా భారతీయ పౌరసత్వం కలిగిన వారికి ఈటా వీసా ఇవ్వడం లేదని తెలిసిందని, దీంతో తమను మరోసారి మోసం చేసేందుకు చూసిన తస్కిన్‌పై చర్యలు తీసుకోవాలని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు