ఉచితశిక్షణ పేరిట మోసం

28 Jan, 2019 09:56 IST|Sakshi
ఆందోళనకు దిగిన మహిళలు నకిలీ సర్టిఫికెట్‌ను చూపిస్తున్న బాధితురాలు  

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉచిత కుట్టు శిక్షణ పేరుతో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఘరాన మోసానికి పాల్పడ్డాడు. రెండునెలల శిక్షణ పేరుతో మహిళల నుంచి రూ.1550 చొప్పున వసూలు చేశాడు. అనంతరం నకిలీ సర్టి ఫికెట్లు అంటగడుతున్నట్లు బయటపడడంతో బాధితులు ఆదివారం లబోదిబోమన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాలసంక్షేమ సంఘంలో మూడు నెలలక్రితం టీఆర్‌ఎస్‌ అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి, మాల మహిళా సంఘం అధ్యక్షురాలు బెల్లం శ్రీలతతో కుట్టుశిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభ దశలో ప్రభుత్వ గుర్తింపు పొందిన కుట్టు సర్టిఫికెట్‌తో పాటు ఉచితంగా కుట్టుశిక్షణ రెండు నెలలపాటు ఇచ్చి కుట్టుమిషన్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని మాయమాటలు చెప్పాడు.

ఇది నమ్మిన 550 మంది మహిళలు రెండు నెలల నుంచి కుట్టు శిక్షణ పొందారు. కొంతమంది హాజరు కాలేదు. కుట్టు శిక్షణ నేర్చుకున్నవారు తమకు కుట్టుమిషన్‌ ఇప్పించాలని కోరారు. దీంతో అసలు విషయం బయటపడింది. 550 మంది వద్ద రూ.1550 చొప్పున రూ.8.60 లక్షలు వసూలు చేసి, మాల మహిళా సంఘం పేరుతో ఉన్న సర్టిఫికెట్లు జారీ చేశారు. అనుమానం వచ్చిన మహిళలు దీనిపై నిలదీశారు. బెల్లం శ్రీలత సర్టిఫికెట్ల విషయంతో మాట మార్చగా ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రంగప్రవేశంచేసి శ్రీలతతో పాటు అందుకు కారకులైన వారిని అందుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, గంభీరావుపేట మండలంలో కూడా అనేక మంది దీంట్లో మోసపోయారని తేలింది. సీఐ రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు. బాధ్యులపై కేసునమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు