బీరు తాగడంలేదనే కోపంతో స్నేహితుడిపై దాడి

5 Feb, 2020 09:33 IST|Sakshi
దాడిలో గాయపడిన దినేష్‌

బంజారాహిల్స్‌: తనతో పాటు బీరు తాగడం లేదన్న కోపంతో స్నేహితుడిపై బీరు సీసాతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నం బంటుమిల్లు గ్రామానికి చెందిన ఎం. దినేష్‌ ఇంటర్‌ చదువుకుంటున్నాడు. ఓ కేసులో బెయిల్‌ రాగా ప్రతి సోమవారం పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో సంతకం చేయడానికి వస్తుంటాడు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 8.30 గంటలకు రైలు దిగి తన స్నేహితుడు గణేష్‌తో పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వచ్చి హాజరు సంతకం చేశాడు. బయటకు వచ్చాక మరో స్నేహితుడు నవీన్‌ బాగా గుర్తు చేస్తున్నాడని ఒకసారి కలుద్దాం అంటూ గణేష్‌ చెప్పడంతో ఇద్దరూ కలిసి నవీన్‌ నివసించే ఎస్పీఆర్‌హిల్స్‌ శ్రీరాంనగర్‌ సమీపంలోని సంజయ్‌నగర్‌ మార్కెట్‌ పక్కన హనుమాన్‌ టెంపుల్‌ గుంతలో గోరఖ్‌నాథ్‌ టెంపుల్‌ను ఆనుకొని దినేష్, గణేష్, నవీన్, సాయి నలుగురు స్నేహితులు కలిసి మద్యం తాగుతున్నారు.

దినేష్‌ మద్యం తాగకుండా కూర్చోవడంతో పలుమార్లు నవీన్‌ బతిమిలాడాడు. అయినా సరే తనకు ఇష్టం లేదని చెప్పడంతో తాగుతున్న బీరు సీసాను పగులగొట్టిన నవీన్‌ కోపంతో దినేష్‌ తల, వీపుపై గట్టిగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావం మధ్య విలవిల్లాడుతున్న దినేష్‌ను అక్కడే ఉన్న సాయి ఉస్మానియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. దినేష్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నవీన్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నవీన్‌ ప్లంబర్‌గా పని చేస్తుంటాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ నవీన్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు