కొండంత విషాదం

7 Mar, 2019 08:49 IST|Sakshi
ఘటనా స్థలంలో బూర కుమార్, మన్నెం సాయి మృతదేహాలు

శివరాత్రి వేడుకల్లో అపశ్రుతి..

బోడికొండపై నుంచి జారి పడి ఇద్దరి మృతి

మరొకరి పరిస్థితి విషమం

రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన వైనం

శ్రీకాకుళం , నెల్లిమర్ల రూరల్‌: అంతవరకు ఆ ఇద్దరు స్నేహితులు అక్కడే ఆడుకున్నారు. శివరాత్రి సందర్భంగా వీధిలో ఉన్న స్నేహితులతో కలిసి ఆట, పాటలతో సందడి చేశారు. రామతీర్థంలో జరుగుతున్న శివరాత్రి జాతరను చూసొద్దామనుకుని వెళ్లిన వారు బోడికొండపై విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ హృదయ విదారకర సంఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆదుకుంటారనుకున్న కుమారులు ఇలా అర్ధంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి సమయంలో జరగగా బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. జాతరకు వెళ్లి రోజులు గడుస్తున్నా బిడ్డలు ఇంటికి చేరకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న బంధువుల సహకారంతో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో నెల్లిమర్ల పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు.

ఈ సంఘటనపై స్థానికులు పోలీసులు అందించి వివరాలు ఇలా ఉన్నాయి.. విజయనగరం ప్రశాంత్‌నగర్‌కు చెందిన బూర కుమార్‌ (16), మన్నెం సాయి(14) ఇద్దరూ ప్రాణస్నేహితులు. శివరాత్రి సందర్భంగా రోజంతా ప్రశాంత్‌నగర్‌లోనే సందడిగా గడిపారు. అనంతరం రామతీర్థంలో జరగుతున్న జాతర చూద్దామని బాబామెట్టకు చెందిన అయితి నాగరాజు (26)తో కలిసి ద్విచక్ర వాహనంపై సోమవారం రాత్రి సుమారు 1.30 సమయంలో బయలుదేరారు. సీతారామునిపేట జంక్షన్‌ వద్ద బైక్‌ పార్క్‌ చేసి ఎదురుగా ఉన్న బోడికొండ పైకి అడ్డదారిలో ఎక్కేందుకు ప్రయత్నించారు. కొంతదూరం వెళ్లేసరికి అదుపు తప్పడంతో ముగ్గురూ పడిపోయారు. ఈ ప్రమాదంలో బూర కుమార్, మన్నెం సాయి అక్కడికక్కడే మృతి చెందగా.. అయితి నాగరాజు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. జనసంచారం లేని ప్రాంతం కావడంతో ఎవ్వరూ ఈ ప్రమాదాన్ని గుర్తించలేదు. అపస్మారక స్థితిలో ఉన్న నాగరాజుకి బుధవారం ఉదయం కొద్దిగా తెలివి రావడంతో కొండ దిగి గట్టిగా కేకలు వేయడంతో సీతారామునిపేట గ్రామానికి చెందిన పలువురు ఆ యువకుడి వద్దకు చేరుకొని మంచినీరు అందించి విషయం తెలుసుకున్నారు. వెంటనే 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్‌ సీఐ రమేష్, ఎస్సై అశోక్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.  

నాగరాజు పరిస్థితి విషమం....
విజయనగరం బాబామెట్టకు చెందిన నాగరాజు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రస్తుతం విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగరాజు తండ్రి కొన్నేళ్ల కిందటే చనిపోగా.. అప్పటి నుంచి పెయింటర్‌గా పనిచేసుకుంటూ కుటుం బాన్ని నెట్టుకొస్తున్నాడు.

మృతదేహాల తరలింపులో ఇక్కట్లు...
బోడికొండ ఎక్కేందుకు కూడా వీలుపడని ప్రాంతంలో ప్రమాదం జరగడంతో మృతదేహాలను కిందకు దించడం పోలీస్‌లకు సవాల్‌గా మారింది. మృతుల కుటుంబాల సభ్యుల సహకారంతో డోలీలపై అతికష్టం మీద ఇద్దరి మృతదేహాలను కిందకు దించారు. అప్పటికే కుమారుల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు పిల్లల మృదేహాలను చూసి గుండెలవిసేలా రోదించారు. వాళ్లను ఆపడం కూడా ఎవరి తరం కాలేదు. బూర కుమార్‌ ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు లక్ష్మి, ఆది కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాగే మన్నెం సాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి రాము ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు