ఉద్యోగవేటకు బయలుదేరి..

29 May, 2019 12:22 IST|Sakshi
సంపత్‌కుమార్‌ యాదవ్‌ (ఫైల్‌) మణిరోహిత్‌ (ఫైల్‌)

రైలు ప్రమాద మృతులిద్దరూ స్నేహితులే..

వైద్యశాలకు చేరుకుని తల్లడిల్లిన మృతుల కుటుంబ సభ్యులు

నాయుడుపేటటౌన్‌: నాయుడుపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో సోమవారం జరిగిన రైలు కిందపడి మృతిచెందిన ఇద్దరు యువకుల పూర్తి వివరాలను మంగళవారం కుటుంబ సభ్యుల నుంచి రైల్వే పోలీసులు సేకరించారు. ఇద్దరూ స్నేహితులు. రద్దీగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఫుట్‌పాత్‌ వద్ద ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడిపోతున్న స్నేహితుడిని మరో స్నేహితుడు కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో ఇద్దరూ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. సూళ్లూరుపేట రైల్వే పోలీసు స్టేషన్‌ ఎస్సై కృష్ణయ్య కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా పెదపరిపూడి మండలం వింజీరంపాడు గ్రామానికి చెందిన వీర్ల సంపత్‌కుమార్‌ యాదవ్‌ (25) బీటెక్‌ పూర్తి చేసి చెన్నైలోని ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు.

నెలకోసారి స్వగ్రామానికి వచ్చి తల్లిదండ్రులను కలిసి వెళుతుంటాడు. ఈక్రమంలో సంపత్‌కుమార్‌ స్నేహితులైన  విజయవాడ వెంకటేశ్వరపురం ప్రాంతానికి చెందిన సోప్పవరపు మణిరోహిత్‌ (22),  విజయవాడ మధురానగర్‌కు చెందిన మరో స్నేహితుడు కాశేపు ఉమామహేష్‌లు బీటెక్‌ పూర్తి చేశారు. చిన్ననాటి స్నేహితులైన ఇద్దరూ చెన్నైకు వెళ్లే ఏదైనా ఉద్యోగాలు చుసుకోవచ్చని మాట్లాడుకున్నారు. దీంతో సోమవారం మధ్యాహ్నం విజయవాడ నుంచి సంపత్‌కుమార్, మణిరోహిత్, ఉమామహేష్‌లు ముగ్గురూ కలిసి హౌరా – తిరుచ్చి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చెన్నైకు బయలుదేరారు. రైలు నాయుడుపేటకు వచ్చే సరికి ఫుట్‌పాత్‌ సమీపంలో ఉన్న ముగ్గురి స్నేహితుల్లో మణిరోహిత్‌ ప్రమాదవశాత్తు జారిపడిబోతుండగా సంపత్‌కుమార్‌ అతడిని కాపాడబోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ రైలు కిందపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారని రైల్వే పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశారు. రెండు మృతదేహాలకు మంగళవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు స్వగ్రామాలకు తీసుకెళ్లారు.

కళ్లెదుటే ప్రాణాలు పోయాయి
రైలులో వెళుతుండగా మార్గమధ్యలో నాయుడుపేటలో తన కళ్లదుటే ఇద్దరూ ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు పోగొట్టుకున్నారని ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఉమామõßహేష్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. అదేవిధంగా రైలు ప్రమాదంలో సంపత్‌కుమార్‌ మృతిచెందినట్టుగా తెలుసుకున్న అతని తండ్రి శ్రీనివాసరావు ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఒక్కగానొక్క కుమారుడు కుటుంబానికి ఆధారంగా ఉంటాడని భావించిన తండ్రి సంపత్‌ మృతితో తల్లడిల్లిపోయాడు. గుర్తుపట్టలేని విధంగా శరీరం నుజ్జునుజ్జుగా మారిన మణిరోహిత్‌ కుటుంబసభ్యులు ఆవేదనకు అంతులేకుండా పోయింది.

యాదవ్‌ సంక్షేమ సంఘ నాయకుల సంతాపం
రైలు ప్రమాదంలో విజయవాడ ప్రాంతానికి చెందిన విద్యార్థులు సంపత్‌కుమార్‌ యాదవ్, మణిరోహిత్‌లు మృతి చెందినట్లు తెలుసుకున్న స్థానిక యాదవ సంక్షేమ సంఘ నాయకులు మంగళవారం ప్రభుత్వ వైద్యశాల వద్దకు చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి యువకులు మృతదేహాలకు త్వరితగతిన పోస్టుమార్టం నిర్వహించేలా రైల్వే పోలీసులు, వైద్యులతో మాట్లాడి సహాయ సహకారాలు అందించారు. 

మరిన్ని వార్తలు