కులం పేరుతో దూషించారంటూ మహిళ ఫిర్యాదు

8 Jul, 2019 14:34 IST|Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌ : అటవీ భూములను స్వాధీనం చేసుకోడానికి వెళ్లిన ఫారెస్ట్ అధికారి అనితపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు, ఆయన అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎఫ్‌ఆర్‌ఓ అనితపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఆమెతోపాటు మరో 15 మంది అధికారులపై కేసు నమోదుచేయడం గమనార్హం. ఫారెస్ట్ అధికారి అనిత, ఇతర సిబ్బంది తనను కులం పేరుతో దూషించడమే కాక, దాడికి పాల్పడ్డారని సార్సాల గ్రామానికి చెందిన నాయిని సరోజ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఫారెస్ట్ సిబ్బందిపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశామనీ, ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.  

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతంలోని సర్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు.

అయితే, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సిర్పూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరుకోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కృష్ణ అధికారులపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అనుచరులతో కలిసి మహిళా ఎఫ్‌ఆర్వోపై ఒక్కసారిగా కర్రలతో దాడికి పాల్పడ్డాడు. అతనితోపాటు మరికొంతమంది కర్రలు చేతబూని అధికారులను బెదిరింపులకు గురిచేశారు. ఈ దాడిలో ఎఫ్‌ఆర్వో అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే సోదరుడి వల్ల తనకు ప్రాణ హానీ ఉందని అనిత ఆరోపించడంతో.. ప్రస్తుతం ఆమెకు పోలీస్‌ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు