బందరులో జోరుగా జూదం

30 Jul, 2018 13:40 IST|Sakshi

బందరులో భారీగా పేకాట శిబిరాల నిర్వహణ

పేకాటరాయుళ్లకు ఫోన్లలో ఆహ్వానాలు

భారీగా నష్టపోతున్న జూదరులు

కోట్లకు పడగలెత్తుతున్న నిర్వాహకులు

‘‘ఫలానా తోటలో ఆదివారం పేకాట శిబిరం నిర్వహిస్తున్నాం’’ మా ఆటకు రండి.. పందేలు కట్టండి.. నోట్ల కట్టలతో వెళ్లండి’’ అంటూ వినూత్నంగా పందెంరాయుళ్లకు నిర్వాహకుల నుంచి సందేశాలు వస్తున్నాయి.  ఫోన్లలోనే ఆహ్వానాలు అందుతున్నాయి. ఇంకేముంది ఇదే మంచి తరుణమంటూ పేకాటప్రియులు నాలుగుముక్కలాటకు జై కొడుతూ శిబిరాల వైపు పరుగు తీస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముకాస్తా పేకాటలో పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పేకాటలకు అడ్డాగా మారింది. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పేకాటరాయుళ్ల పందెం కూతలు వినబడుతున్నాయి. రెండు నెలలుగా పట్టణంతో పాటు పలు గ్రామాల్లోని మారుమూల ప్రదేశాల్లో శిబిరాలు జోరుగా నిర్వహిస్తున్నారు. గతంలో ఎక్కడో ఒకచోట జరిగే జూద శిబిరాలు గ్రామ గ్రామాన పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. 

శిబిరాల జోరు
బందరు మండలంలో పేకాట శిబిరాలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అదృష్టాన్ని పరీక్షిం చుకునేందుకు అమాయకులు (పేకాటరాయుళ్లు) శిబిరాల వైపు పరుగులు పెడుతున్నారు. కాయ్‌ రాజా కాయ్‌ అంటూ లక్షల్లో పందాలు కడుతున్నారు. ఆట ముగిసేసరికి సొమ్మంతా నిర్వాహకుల జేబుల్లో పోసి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. మండలంలో 34 పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 54 గ్రామాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా గ్రామాల్లో పేకాటరాయుళ్ల పందెం కూతలతో మారుమోగుతున్నాయి. 

పెట్టుబడి లేకుండా లాభాలు
పేకాటలో ఆటగాళ్లు బికారులు అవుతుండగా నిర్వాహకులకు కనకవర్షం కురుస్తోంది. పేకాట నిర్వాహకులుæ పెట్టుబడి లేకుండానే లక్షలు పోగేసుకుంటున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో మచిలీపట్నానికి చెందిన అనేకమంది శిబిరాలు నిర్వహిస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారు.  ఈజీ మనీకి అలవాటుపడిన నిర్వాహకులు పేకాటరాయుళ్ల ఫోన్‌ నంబర్లు తీసుకొని ‘మా ఆటకు రండీ అంటే మా ఆటకు రండీ’ అంటూ ఆహ్వానాలు పంపుతున్నారు. రోజుకు రెండు ఆటలు పెడుతూ అమాయకుల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.

గ్రామాలే అడ్డాగా...
బందరు మండలంలోని మంగినపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, పోతేపల్లి, కోన తదితర గ్రామాల్లో కోతముక్క ఆట విచ్చలవిడిగా సాగుతుంది. పట్టణంలోని బైపాస్‌రోడ్డులో పేకాట జోరుగా సాగుతున్నట్లు తెలిసింది. మంగినపూడిలో గ్రామానికి చెందిన వ్యక్తి ప్రతి ఆదివారం ఆట పెడుతూ పేకాటరాయుళ్ల సొమ్ములు దిగమింగుతుండగా, మేకవానిపాలెంకు చెందిన మరో వ్యక్తి ఇటీవల వరకు శిబిరాలు నిర్వహించి రూరల్‌ పోలీసుల హెచ్చరికలతో స్వస్తి పలికాడు. కరగ్రహారానికి చెందిన ఇంకో వ్యక్తి కొన్ని రోజులుగా ఆట మొదలుపెట్టి ఆటగాళ్లను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రసాదంలా మింగేస్తున్నాడు
మచిలీపట్నం బైపాస్‌రోడ్డుకు చెందిన ఒక వ్యక్తి బైపాస్‌రోడు, సుల్తానగరం, గూడూరు, ఘంటసాల, కూచిపూడి తదితర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహించి పెట్టి లక్షలకు లక్షలు వెనకేశాడనే ప్రచారం సాగుతుంది. అక్రమ సంపాదనతో పలు గ్రామాల్లో లక్షలు ఖరీదు చేసే భూములు కొనుగోలు కూడా చేసినట్లు పేకాట రాయుళ్లే చెప్పుకుంటున్నారు. శిబిరాలు మారుస్తూ పేదల సొమ్మును ప్రసాదంలా మింగేస్తున్న నిర్వాహకుడిపై సంబంధిత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.  నిజాంపేటకు చెందిన మరో వ్యక్తి రెండు పూటలా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలి సింది. ఇక్కడి ఆటకు వెళ్ళిన వారంతా జేబులకు చిల్లులు పెట్టుకుని రావడమే తప్ప జేబులు నింపుకునే ప్రసక్తే లేదన్న వాదన వినబడుతుంది. చల్లపల్లికి చెందిన మరో వ్యక్తి చల్లపల్లి, ఘంటసాల, కూచిపూడి. మొవ్వ, కోసూరు, పద్దారాయుడుతోట, బందరు ప్రాంతాలకు చెందిన పేకాటరాయుళ్లను పిలిపించి  కోన గ్రామ పరిసరాలు జూదాలు నిర్వహిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. నిర్వాహకుల ఆదాయం రోజుకు రూ. 10,000ల నుంచి రూ. 20.000లపైబడి ఉంటుందంటే ఏమేరకు శిబిరాలు నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది.

నిద్రపోతున్న నిఘా
బందరు మండలంతో పాటు పట్టణ నడిబొడ్డున పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నా సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. పేకాటలతో వందలాది కుటుంబాలు వీధినపడుతున్నా జిల్లా యం త్రాంగం స్పందించకపోవడంతో నిఘా నిద్రపోతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కాగా కొంత మంది నిర్వాహకులు పోలీసులతో బేరం కుదుర్చుకున్నామంటూ పేకాటరాయుళ్ళను శిబిరాలకు పిలిపించుకోవడం పోలీసుల పనితీరుపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రౌడీషీట్లు తెరుస్తాం  
పేకాటలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులపై పూర్తి నిఘా పెట్టాం. గతంలో ఆటలు పెట్టిన వారిని ఇప్పటికే బైండోవర్‌లు చేశాం. అవసరమైతే రౌడీషీట్లు తెరుస్తాం. ప్రజల శిబిరాల సమాచారాన్ని నేరుగా నా దృష్టికి తీసుకురండి.  సంబందించి సమాచారం ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. సమాచారం అందిన మరుక్షణం దాడులు చేయిస్తాం. శిబిరాలు నిర్వహించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేదిలేదు. ఇతర సబ్‌–డివిజన్‌లో ఆటలు పెట్టే వారి వివరాలను అక్కడి డీఎస్పీలకు తెలియజేస్తాం.మహబూబ్‌బాషా, బందరు డీఎస్పీ

మరిన్ని వార్తలు