మహిళా కొరియోగ్రాఫర్‌కు లైంగిక వేధింపులు..

28 Jan, 2020 13:07 IST|Sakshi

ముంబై : మహిళా కొరియోగ్రాఫర్‌ను అశ్లీల చిత్రాలు చూడాలని ఒత్తిడి చేస్తూ, లైంగిక వేధింపులకు లోనుచేస్తున్నాడనే ఆరోపణలపై కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్యపై ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది. మహారాష్ట్ర మహిళా కమిషన్‌, అంబోలి పోలీస్‌ స్టేషన్‌లలో గణేష్‌ ఆచార్యపై 33 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్‌ ఫిర్యాదు చేశారు. ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కొరియోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ (ఐఎఫ్‌టీసీఏ) ప్రధాన కార్యదర్శి కూడా అయిన గణేష్‌ ఆచార్య తన ఆదాయంలో కమీషన్‌ ఇవ్వాలని కోరేవాడని, అశ్లీల వీడియోలు చూడాలని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఐఎఫ్‌టీసీఏ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత గణేష్‌ ఆగడాలు మితిమీరాయని వాపోయారు. గణేష్‌ కోరికను తిరస్కరించడంతో ఆయన తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ తన ఐఎఫ్‌టీసీఏ సభ్యత్వాన్ని తొలగించారని ఆరోపించారు. తనకు పని ఇవ్వరాదని ఇతర కొరియోగ్రాఫర్లకు గణేష్‌ లేఖలు రాశారని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో సీనియర్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ సైతం గణేష్‌ ఆచార్య డ్యాన్సర్లను వేధిస్తున్నారని ఆరోపించడం గమనార్హం. తనపై గణేష్‌ వదంతులు ప్రచారం చేశారని తనుశ్రీ దత్తా ఆరోపించారు. నానా పటేకర్‌తో పాటు గణేష్‌పైనా ఆమె ఆరోపణలు గుప్పించారు. 2008లో నిర్మించిన హార్న్‌ ఓకే ప్లీజ్‌ మూవీకి గణేష్‌ ఆచార్య కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ మూవీ సాంగ్‌ చిత్రీకరణ సమయంలోనే నానా పటేకర్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే.

చదవండి : డబ్బులు ఇవ్వకుంటే లైంగిక దాడి కేసు పెడతా!

మరిన్ని వార్తలు