రైస్‌ 'కిల్లింగ్‌'!

5 Sep, 2019 05:22 IST|Sakshi

‘రైస్‌ పుల్లర్‌’ పేరుతో వంచిస్తున్న ముఠాలు 

డబ్బులు, ప్రాణాలు పోగొట్టుకుంటున్న బాధితులు

అమలాపురంలో డాక్టర్‌ కుటుంబం ఆత్మహత్యకు ఇదే కారణం

సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్‌: బియ్యాన్ని ఆకర్షించే మహిమ కలిగిన అద్భుత యంత్రం ఇంట్లో ఉంటే మహర్దశ పడుతుందనే మూఢ నమ్మకం నిండు కుటుంబాలను బలి తీసుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో డాక్టర్‌ పెన్మెత్స రామకృష్ణంరాజు కుటుంబ ఆత్మహత్యకు రైస్‌ పుల్లర్‌ మోసమే కారణమని పోలీసులు నిర్ధారించారు. రైస్‌ పుల్లర్‌ పేరుతో రూ.5 కోట్లు కాజేసి వైద్యుడి కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన వరికూటి వెంకట వేణుధరప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు అమలాపురం పోలీసులు మంగళవారం ప్రకటించారు. హైదరాబాద్‌లో ఉంటున్న ప్రసాద్‌ మరో ముగ్గురితో కలసి ముఠాగా ఏర్పడి రైస్‌ పుల్లింగ్‌ పేరుతో శ్రీకృష్ణ ఆర్థోపెడిక్‌ అండ్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు రామకృష్ణంరాజు నుంచి రూ.5 కోట్లకుపైగా వసూలు చేశాడు. అప్పుల పాలైన రామకృష్ణంరాజు (55), భార్య లక్ష్మీదేవి (45), పెద్ద కుమారుడు డాక్టర్‌ కృష్ణసందీప్‌ (25) నాలుగు రోజుల క్రితం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడటం తెలిసిందే. 

అతీత శక్తుల పేరుతో మోసాలు..
బియ్యపు గింజల్ని ఆకర్షించే లక్షణాలుండే లోహాన్ని రైస్‌ పుల్లర్‌గా పరిగణిస్తారు. అత్యంత అరుదైన, ఖరీదైన ఇరీడియం లోహాన్ని కలిగి వుండే వీటిని చూపించి మోసగిస్తున్నారు. అతీత శక్తుల పేరుతో వీటిని విక్రయించడం భారతీయ శిక్షాస్మృతి 415, 420 ప్రకారం నేరం. తేలికగా డబ్బులు సంపాదించేందుకు కొందరు ముఠాలుగా ఏర్పడి రైస్‌ పుల్లింగ్‌ పేరుతో రేడియేషన్‌ ఆర్టికల్‌ అమ్మకాలతో మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి దివ్య శక్తులు ఉంటాయని, ఇది ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని నమ్మించి మోసగిస్తున్నారు. రాగి లోహంతో చేసిన గ్లాసులు, గిన్నెలు, బిందెలు, మూతలు, విగ్రహాలు, నగలు, పాతకాలం నాణేలు లాంటివి రైస్‌ పుల్లర్‌ పరికరాలుగా చలామణి అవుతున్నాయి. నల్ల పసుపు, ఎర్ర ఉల్లిపాయ, ఎర్ర కలబంద లాంటి మొక్కల్లో కూడా రైస్‌ పుల్లర్‌ లక్షణాలున్నాయని నమ్మబలుకుతున్న ముఠాలు కూడా ఉన్నాయి.  కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్న ఏడుగురితో కూడిన ముఠాను ఈ ఏడాది జూలైలో మచిలీపట్నం సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రైస్‌ పుల్లింగ్‌ పేరుతో మోసగిస్తున్న ముఠాను ఇటీవల తిరువనంతపురంలో అరెస్టు చేశారు.

రైస్‌ పుల్లింగ్‌ అంటే...?
రైస్‌ అంటే బియ్యం... పుల్లింగ్‌ అంటే లాక్కోవడం. సాధారణంగా ఓ వస్తువుకు కొద్ది గంటలపాటు అయస్కాంతాన్ని రాపిడి చేస్తే కొద్దిసేపు ఆకర్షణ గుణాన్ని పొందుతుంది. రైస్‌ పుల్లింగ్‌లో దీన్ని అద్భుత శక్తిగా నమ్మిస్తారు. పురాతన లోహ విగ్రహాలు, పాత్రలు, నాణేలను రైస్‌ పుల్లింగ్‌ ముఠా తమ మోసాలకు ముడి సరుకుగా వాడుతుంది. వీటికి అయస్కాంతాన్ని రుద్దడం ద్వారా బియ్యపు గింజలను ఆకర్షించి ప్రజలను మోసగిస్తున్నారు. పురాతన వస్తువుల పేరుతో రూ.కోట్లు కాజేస్తున్నారు.  

మరిన్ని వార్తలు