ఫ్రీ కూపన్లతో కోట్లు కొల్లకొట్టిన గ్యాంగ్‌

22 Jun, 2018 19:49 IST|Sakshi

అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్ : అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ముఠాకు హైదరాబాద్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఫార్చ్యూన్ గ్రూప్ ఆఫ్ ఎస్టేట్స్ పేరుతో ఓ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజలను మోసం చేయడంలో ఈ ముఠా ఓ పధకాన్ని అమలు చేస్తుంది. ముఠా సభ్యులు షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, సినిమాలకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని ఫ్రీ గిప్ట్ కూపన్ల పేరుతో గాలం వేస్తారు. ఆపై క్లబ్‌ మెంబర్షిప్‌, హాలిడే ప్యాకేజీ, హెల్త్‌కార్డు, వెండి నాణేలు ఇస్తామంటారు. ఆ తరువాత ఓపెన్‌ ఫ్లాట్లు, వెంచర్లు తక్కువ ధరకే ఇస్తామంటూ అమాయకులకు ఎరవేసి లక్షలు శఠగోపం పెడతారు.

ఇలా వేలాది మంది నుంచి కోట్లాది రూపాయలను అక్రమంగా వసూలు చేశారు. అయితే ఎన్నిరోజులైనా నిర్వాహకులు చెప్పినవి రాకపోవడంతో బాధితులు నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్‌ క్లబ్‌ నడుపుతున్న షేక్‌ ఖాదర్‌ బాష, విజయ్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 8లక్షల నగదు, గిప్ట్‌ కూపన్లు, వెండి నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకృష్ణ రావు మాట్లాడుతూ నిందితులపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు