విజయవాడ దొంగల ముఠా అరెస్ట్‌

5 Nov, 2019 19:29 IST|Sakshi

సాక్షి​, విజయవాడ: అవసరాలు తీర్చుకొనేందుకు దొంగలుగా అవతారం ఎత్తిన తొట్టిగ్యాంగ్ గుట్టు రట్టయింది. వరుసచోరీలకు పాల్పడి బెంబేలెత్తించిన ముఠా నిఘా కెమెరాల్లో చిక్కి బుక్కైంది. మంగళవారం పోలీసుల చేతికి చిక్కి కటకటాల ఊచలు లెక్కపెడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముఖానికి ముసుగులు ధరించి ఉన్న ఈ ముఠాలో దాసరి దుర్గారావు, జగన్నాధం షణ్ముఖలు ఇద్దరూ విజయవాడలోని రాజరాజేశ్వరీపేటకు చెందినవారు. వీరికి చదువు అబ్బకపోవటంతో చెడు దారిపట్టి వ్యసనాలకు బానిసలయ్యారు. అవసరాలు తీర్చుకొనేందుకు దొంగతనంపై దృష్టిపెట్టారు. దొంగతనాలు, దోపిడీలు చేసి తమ అవసరాలు తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

తాము ఉన్న ప్రాంత పరిసరాల్లో చేతివాటం ప్రదర్శించి ఇప్పటికే చాలాసార్లు పట్టుబడ్డారు. కాగా జైలుకి వెళ్లి వచ్చినా వారిలో ఏమాత్రం మార్పు రాకపోగ మళ్లీ దొంగతనాలకు తెగబడ్డారు. మరో ఇద్దరు మైనర్లని తమ ముఠాలో చేర్చుకుని.. దొంగతనాలు ఏలాచేయాలో తర్ఫీదు ఇచ్చారు. వారు ఎంపిక చేసుకొన్న షాపులోల​ డబ్బు అవసరమైనప్పుడు కన్నం వేయాలని స్కెచ్ వేశారు. అనుకున్నట్టే ఈ నెల ఒకటో తేదీ రాత్రి అజిత్‌సింగ్‌నగర్‌లోని మూడు దుకాణాల్లో చొరబడ్డారు. హెచ్‌పీ గ్యాస్, సంగం డైరీ, గురుసాయి మెడికల్ అండ్ ఫాన్సీ షాపుల్లో చోరి చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్త బృందాన్ని రంగంలోకి దించి వేలిముద్రలు సేకరించారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను పరిశీలించారు. మైనర్లు కూడా దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. దాంతో వారిని అదుపులోకి తీసుకొని తమ దైనశైలిలో విచారించారు. వారిని నడిపిస్తున్న తోడుదొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, 42 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు