యువతి కోసం గుంటూరులో గ్యాంగ్‌ వార్‌ 

9 Jun, 2020 09:02 IST|Sakshi
పోలీసుల అదుపులో ఉన్న యువకులు

యువతి కోసం ఇద్దరు యువకుల మధ్య పోరు 

గుంటూరులోని పిచ్చుకులగుంట వద్ద ఆదివారం రాత్రి ఘర్షణ 

రెండు గ్రూపులుగా విడిపోయి తన్నులాటకు సిద్ధం  

నిమిషాల వ్యవధిలో స్పందించి నిలువరించిన అరండల్‌పేట పోలీసులు 

విచారణ చేపట్టిన పోలీసులు 

రంగంలోకి దిగిన ఏఎస్పీ డి. గంగాధరం 

సాక్షి, గుంటూరు: గుంటూరులో ఆదివారం రాత్రి గ్యాంగ్‌వార్‌ కలకలం సృష్టించింది. ఒక యువతి కోసం ఇద్దరు యువకులు వారి స్నేహితులతో రెండు గ్రూపులుగా విడిపోయి, ఘర్షణకు దిగడంతో అలజడి వాతావరణం ఏర్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు, విశ్వసనీయ సమాచారం మేరకు.. గుంటూరు రూరల్‌ చౌడవరం సమీపంలోని ఒక ఇంజినీరింగ్‌ కళాశాలలో వసంతరాయపురానికి చెందిన ప్రణయ్‌ బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నగరంలోని బృందావన్‌ గార్డెన్స్‌కు చెందిన ఒక విద్యార్థిని అతడికి స్నేహితురాలు. ఆమెకు ఇన్‌స్ట్రాగామ్‌లో అకౌంట్‌ ఉండటంతో, కృష్ణనగర్‌కు చెందిన ఆవుల దివేష్‌ అలియాస్‌ సన్ని మేసేజ్‌లు పంపుతుండేవాడు. సన్నీ పంపుతున్న మేసేజ్‌ల విషయాన్ని సదరు విద్యార్థిని ప్రణయ్‌కు చెప్పడంతో సాంతికేతిక మాధ్యమాల ద్వారా ఇద్దరి మధ్యా వివాదం నెలకొంది.

మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దమ్ముంటే చూసుకుందాం రమ్మంటూ..ఇద్దరూ ఫోన్‌ నంబర్లు పంపుకున్నారు. విషయంపై తేల్చుకుందాం రమ్మంటూ..డొంకరోడ్డు వద్ద ముందుగా ప్రదేశాన్ని ఖరారు చేసుకున్నారు. డొంక రోడ్డు 6వ లైను వద్ద రెండు వర్గాలు కలిపి సుమారు 40 నుంచి 50 మంది విద్యార్థులు, యువకులు చేరడంతో అక్కడ స్థానికులు కేకలు వేశారు. అక్కడ నుంచి పిచ్చుకులగుంట వద్ద బాహాబాహీకి  సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న అరండల్‌పేట స్పెషల్‌ బ్రాంచి కానిస్టేబుల్, ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సిబ్బందిని ఘటన స్థలానికి పంపేసరికి ఘర్షణ వాతావరణం నెలకొంది.

అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులతో పాటు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సమాచారం వేగవంతంగా తెలియడం, సిబ్బంది త్వరితగతిన స్పందించడంతో ఎటువంటి ఘటనలు జరగకపోవడంతో పోలీసులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఘర్షణకు వచ్చిన వారిలో గుంటూరు రూరల్‌ జిల్లా పరిధిలోని ఒక స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ కుమారుడు ఉన్నట్లు సమాచారం. చదవండి: గ్యాంగ్‌ వార్‌: ఇప్పుడు దృష్టంతా ఆ సమాచారం పైనే!

ఘర్షణ జరిగిన  ఘటన స్థలంలో స్థానికుడిని విచారిస్తున్న ఏఎస్పీ గంగాధరం

ముమ్మర దర్యాప్తు  
యువతి విషయంలో విద్యార్థుల ఘర్షణపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అరండల్‌పేట పీఎస్‌లో ఉన్న విద్యార్థులు, యువకులను సోమవారం అడిషనల్‌ ఎస్పీ డి. గంగాధరం, వెస్ట్‌ డీఎస్పీ బి.వి. రామారావు, స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు విచారించారు. ఘర్షణలకు కారణమైన వాస్తవాలను వెలికి తీసేందుకు విచారణ చేపట్టారు. యువతి విషయంలోనే ఘర్షణ లేక..ఇతరత్రా ఏమైనా ఉన్నాయా... ఘర్షణ సమయంలో ఉన్న విద్యార్థులు కాకుండా, ఇతరత్రా ఉన్న యువకులపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కొంత మంది యువకులు ఇన్నోవా..మరికొంత మంది ద్విచక్ర వాహనాలపై పిచ్చుకులగుంట వద్దకు చేరుకున్నట్లు తెలుస్తోంది. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని ఏఎస్పీ గంగాధరం స్పష్టం చేశారు. కొంత మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని, మరికొంత మందిపై విచారణ జరుగుతోందని తెలిపారు. చదవండి: గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే! 

మరిన్ని వార్తలు