జైల్లోనే గ్యాంగ్‌స్టర్‌ కాల్చివేత

9 Jul, 2018 10:03 IST|Sakshi
గ్యాంగ్‌స్టర్‌ మున్నా భజ్‌రంగీ(పాత చిత్రం)

లక్నో : గ్యాంగ్‌స్టర్‌ ప్రేమ్‌ ప్రకాశ్‌ సింగ్‌ అలియాస్‌ మున్నా భజ్‌రంగీ సోమవారం ఉదయం భాగ్‌పత్‌ జైల్లో హత్యకు గురయ్యాడు. అదే జైల్లో ఉన్న మరో గ్యాంగ్‌స్టర్‌ అతన్ని తుపాకితో కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీ జైల్లో ఉన్న మున్నాను ఓ కేసులో భాగంగా సోమవారం ఉదయం భాగ్‌పత్‌ కోర్టులో హాజరు పరచాల్సి ఉంది. దీంతో ఆదివారం మున్నాను స్థానిక జైలుకు తీసుకొచ్చారు. ఈ రోజు ఉదయం జైలుకు తరలించే సమయంలో జైల్లోనే ఉన్న మరో గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌ రాతి మున్నాపై తుపాకితో దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు.

కొన్ని రోజుల క్రితం మున్నా భార్య సీమా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపారు.  మున్నా యూపీ పోలీసుల హిట్‌ లిస్ట్‌లో ఉన్నాడని ఆమె పేర్కొన్నారు. దీంతో మున్నా హత్యపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. మరో గ్యాంగ్‌స్టర్‌ సునీల్‌, మున్నాను హతమార్చినట్టు వెల్లడించారు. లోకల్‌ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.

జైళ్ల శాఖ ఏడీజీ చంద్ర ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. సంఘటన స్థలంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఉన్నతాధికారులను అక్కడికి పంపినట్టు తెలిపారు. జైల్లో మరణాయుధాలు ఏ విధంగా వచ్చాయో తెలాల్సి ఉందన్నారు. కాగా మున్నాపై పలు హత్య కేసులతోపాటు, బెదిరింపులు, కిడ్నాప్‌లకు పాల్పడిన కేసులు కూడా ఉన్నాయి. నేర చరిత్ర కలిగిన మున్నా 2012 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్నా దళ్‌ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మున్నా వ్యవహారాలన్ని చూసుకుంటున్న అతని  బామర్ధి పుష్పజిత్‌ కూడా 2016లో హత్యకు గురయ్యాడు.

>
మరిన్ని వార్తలు