గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ సోదరి అరెస్ట్‌

21 Nov, 2019 09:32 IST|Sakshi
సలీమాబేగం

సాక్షి, భువనగిరి: భూ ఆక్రమణలకు పాల్పడిందని అభియోగం మేరకు గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ సోదరి సలీమాబేగంను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ ఎం.సురేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పరిధిలోని సర్వే నంబర్‌ 590, 586లలో భూయాజమాని కె.అభినందన్‌ ప్లాట్లు చేసి 2006 సంవత్సరం కంటే ముందు విక్రయించాడు. వి.శంకర్‌చారి ఆ ప్లాట్లను కొనుగోలు చేశారు. 2007 తర్వాత అభినందన్‌కు చెందిన ఐదెకరాల భూమిని సలీమాబేగం, గ్యాంగ్‌స్టర్‌ నయీమ్, అతని గ్యాంగ్‌ సభ్యుల పేరిట ఎక్కరం చొప్పున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆ భూమిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అయిన ఎడ్ల వెంకట్‌రెడ్డికి విక్రయించారు.. ఆ భూమిని వెంకట్‌రెడ్డి లండన్‌ టౌన్‌షిప్‌ పేరుతో వెంచర్‌ చేసి ప్లాట్లు విక్రయించాడు. మొదట కొన్న ప్లాట్ల యాజమానులను చంపుతామని బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు.

అదే విధంగా 2006 సంవత్సరంలో భూమి యాజమాని అయిన కూరపాటి శ్రీదేవి, కూరపాటి శ్రీనివాస్‌లను బెదిరించి వారికి చెందిన 9 ఎకరాల భూమిని  సలీమాబేగం కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఆభూమిని కూడా ఎడ్ల వెంకట్‌రెడ్డికి విక్రయించారు. ఇందులో భాగంగా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్టు వివరించారు. భువనగిరి పరిధిలో 14 కేసులు ఆమెపై నమోదైనట్లు చెప్పారు. భువనగిరి డీసీపీ, ఏసీపీ ఆదేశాల మేరకు కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు. సలీమాబేగంపై భువనగిరితోపాటు శంషాబాద్, షాద్‌నగర్, మిర్యాలగూడ, నల్లగొండ, కోరుట్ల, ఆలేరు, నర్సింగి, ఆదిభట్ల, పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో భూములు, ప్లాట్ల కేసులు ఉన్నట్లు చెప్పారు.  

మరిన్ని వార్తలు