సౌతిండియా మాఫియా డాన్‌ ఆత్మహత్య..

5 Oct, 2017 12:54 IST|Sakshi

సాక్షి, చెన్నై: నిన్నటి వరకూ దక్షిణ భారతాన్ని గడగడలాడించిన డాన్‌ ఆశ్చర్యకరంగా ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడు పోలీసులతో పాటు దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన డాన్‌ శ్రీధర్‌ ధనపాలన్‌(44) బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన శ్రీధరన్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగాడు. అతి తక్కువ కాలంలోనే దక్షిణ భారత దావూద్‌ ఇబ్రహీంగా పేరుపొందాడు. ఇప్పటి వరకూ ఇతనిపై 43కేసులు నమోదయ్యాయి. ఇందులో 7హత్యారోపణలు కూడా ఉన్నాయి. అనంతరం పోలీసుల తనిఖీలు పెరిగిపోవడం, పెద్ద మాఫియా డాన్‌గా ఎదగాలనే కోరికతో పోలీసుల కన్ను కప్పి కంబోడియాకు పారిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యుల మద్య వివాదాలు నడుస్తున్నాయి. దీంతో విసుగు చెంది తన నివాసంలో సైనేడ్‌ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఆసుపత్రికి తరలించగా, సాయంత్రం 6.30 ప్రాంతంలో మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

2013లో భారత్‌ నుంచి తప్పించుకొని కంబోడియాకు వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులను వదిలేసి ఒక్కడే ఉంటున్నాడు. శ్రీధర్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. కుమారుడు లండన్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. అయితే శ్రీధర్‌ మరణ వార్త విని అతని స్వస్థలం కాంచీపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది.

మరిన్ని వార్తలు