‘వాళ్లందరినీ చంపేయండి.. బతకొద్దు’

7 Jul, 2020 15:20 IST|Sakshi

ఎన్‌కౌంటర్‌పై విచారణకు ఆదేశించిన యూపీ సర్కారు

లక్నో: ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేకు సహకరించిన మరో ముగ్గురిని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. దూబే కోడలు చామాతో పాటు వారి పని మనిషి, దూబే అనుచరుడి భార్య రేఖా అగ్నిహోత్రి, పక్కింటి వ్యక్తి సురేశ్‌ వర్మను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దూబే గ్యాంగ్‌ పోలీసులపై విరుచుకుపడిన సమయంలో చామా, రేఖా ఇంట్లోనే ఉన్నారు. దుండగుల కాల్పుల్లో గాయాల పాలైన ఓ పోలీసు అధికారి తలుపు తెరవాల్సిందిగా కోరగా.. చామా అందుకు నిరాకరించింది. (నేర సామ్రాజ్యం)

మరోవైపు.. రేఖా, సురేశ్‌ వర్మ దూబేకు ఎప్పటికప్పుడు పోలీసులు ఎక్కడ ఉన్నారన్న సమాచారం అందించారు. అంతేగాక.. ‘‘ పోలీసులందరినీ చంపేయండి. ఒక్కరూ బతికి ఉండకూడదు’’అంటూ గట్టిగా కేకలు వేస్తూ పోలీసుల జాడ తెలియజేశారు. ఇదిలా ఉండగా.. గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను అదుపులోకి తీసుకునే క్రమంలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌పై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మెజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించింది. కాగా కాన్పూర్‌ సమీపంలోని బిక్రూ గ్రామంలో గురువారం అర్ధరాత్రి దూబే గ్యాంగ్‌ పోలీసులపై కాల్పులకు తెగబడిన విషయం విదితమే.(పోలీసులతో సంబంధాలు.. ఇంట్లో బంకర్‌!)

ఈ ఘటనలో ఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు మరణించారు. ఈ కేసులో ఇప్పటికే దూబే అనుచరుడు దయా శంకర్‌ అగ్నిహోత్రిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక వికాస్ దూబేను ప‌ట్టిస్తే రూ.2.5 ల‌క్ష‌లు బహుమతి ఇస్తామ‌ని యూపీ పోలీసులు ఇది వరకే ప్రకటించారు. ఇక దుబే  స్వగ్రామం బిక్రూలోని అతడి సొంతింటిని పోలీసులు బుల్‌డోజర్లతో శనివారం నేలమట్టం చేయించిన విషయం తెలిసిందే. ఇంటి ఆవరణలో ఉన్న ఖరీదైన కార్లను కూడా ధ్వంసం చేయించారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా