లొంగిపోయిన చైర్‌పర్సన్‌ ఈశ్వరమ్మ

30 May, 2018 12:19 IST|Sakshi
గరిక ఈశ్వరమ్మ

చెన్నై నగరానికి సమీపంలో తలదాచుకున్న వైనం

నెల్లూరుకు తరలించిన పోలీసులు   

సూళ్లూరుపేట: నాటకీయ పరిణామాల మధ్య సూళ్లూరుపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గరిక ఈశ్వరమ్మ మంగళవారం తెల్లవారుజామున సూళ్లూరుపేట పోలీసు స్టేషన్‌లో లొంగిపోయింది. ఈనెల 22వ తేదీ జిల్లా కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ డి.సుధాభారతి ఈశ్వరమ్మ రూ.7,56,66,000 కోట్లు బ్యాంకులకు చెల్లించకుండా ఎగవేతకు పాల్పడిందని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల నుంచి భర్తతో కలిసి తప్పించుకుని పరారైంది. ఎస్సై కె.ఇంద్రసేనా రెడ్డి, సీఐ కిషోర్‌బాబు రెండు బృందాలుగా ఏర్పడి వారంరోజుల నుంచి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.

హోటల్‌లో దిగి..  
మంగళవారం తెల్లవారుజామున బెంగళూరుకు చెందిన ఓ లాయర్, పలువురు ముఖ్యమైన వ్యక్తులు నాలుగు కార్లలో వచ్చి సూళ్లూరుపేట పట్టణంలోని బైపాస్‌లో ఉన్న ఎంఆర్‌ గ్రాండ్‌ హోటల్‌ దిగారు. ఈశ్వరమ్మ వారితో సమాలోచనలు జరిపారు. అనంతరం లాయర్‌ సమక్షంలో భర్త ఈశ్వరయ్యతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈశ్వరమ్మ తమిళనాడులోని చెన్నై నగరానికి దూరంగా ఉన్న ఓ మారుమూల గ్రామంలో తలదాచుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గాలింపు చర్యల్లో ఉన్న సీఐ, ఎస్సైకు పోలీసులు సమాచారం అందించడంతో చెన్నైకు దగ్గరలో ఉన్న ఎస్సై మాత్రం వెంటనే పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. సీఐ సాయంత్రానికి సూళ్లూరుపేటకు చేరుకున్నారు. తడ ఎస్సై దాసరి వెంకటేశ్వరరావు ఈశ్వరమ్మ, వనితలను నెల్లూరులోని ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ఎదుట హాజరుపరిచారు.  

మరిన్ని వార్తలు