‘హిందూ వ్యతిరేకుల హతం కోసం ఓ సంస్థ’

15 Jun, 2018 21:02 IST|Sakshi
పరాశరన్‌ వాగ్‌మేర్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, బెంగుళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ని కాల్చి చంపింది ఎవరో తెలిసిపోయింది. ఇప్పటి వరకు గుర్తించిన ఆరుగురు అనుమానితుల్లో ఒకరైన పరాశరన్‌ వాగ్‌మేర్‌ గౌరీని కాల్చి చంపాడని సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) తేల్చింది. హత్య జరిగిన చోట ఉన్న సీసీటీవీ ఫుటేజిలో వాగ్‌మేర్‌ చిత్రం నమోదైందని సిట్‌ తెలిపింది. కాగా, నిందితున్ని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హిందుత్వ వ్యతిరేకులను అంతమొందించేందుకు ఒక అతివాద హిందుత్వ సంస్థ పనిచేస్తోందని సిట్‌ వెల్లడించింది. కార్యకర్తల్ని నియమించుకొని తమ చేతులకు మట్టి అంటకుండా హేతువాదులు, హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారిని హత్య చేయించేందుకు పథకాలు పన్నుతుందని తెలిపింది. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ అనుమానిత సంస్థ కార్యకలాపాలు నెరుపుతోందని వెల్లడించింది. 

ఆ తుపాకీ దొరకలేదు..!
హేతువాదులు గోవింద్‌ పన్సారే, ఎంఎం కలబుర్గి తరహాలోనే గౌరీ హత్య జరిగింది. ఈ ముగ్గురిని హతమార్చడానికి ఒకే తుపాకీ వాడినట్లు ఫోరెన్సిక్‌ పరీక్షల్లో తేలిందని సిట్‌ స్పష్టం చేసింది. అయితే, నిందితులను పట్టుకున్నా, హత్యలు చేయడానికి వాడిన ఆ తుపాకీని కనుగొనాల్సి ఉందని సిట్‌ బృందంలోని సభ్యుల్లో ఒకరు తెలిపారు.

గౌరీ హత్య కేసులో అరెస్టయిన సజీత్‌ కుమార్‌ అలియాస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అనుమానిత అతివాద హిందూ సంస్థలో పనిచేసేందుకు కార్యకర్తల్ని నియమించుకున్నట్లు తమ దర్యాప్తులో బయటపడిందని సిట్‌ బృందం తెలిపింది. అయితే, హత్యలకు పాల్పడే ఆ సంస్థకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించింది. గౌరీ లంకేశ్‌ హత్య కేసుతో సంబంధమున్న మరో ముగ్గురిని అరెస్టు చేయాల్సి ఉందని సిట్‌ వెల్లడించింది. మరోవైపు కన్నడ రచయిత ప్రొఫెసర్‌ కేఎస్‌ భగవాన్‌ను చంపడానికి యత్నిస్తుండగా ఈ ముఠా సభ్యులను పట్టుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు