గతి తప్పిన ‘గజల్‌’

3 Jan, 2018 02:37 IST|Sakshi

లైంగిక వేధింపుల కేసులో గజల్‌ శ్రీనివాస్‌ అరెస్ట్‌

తాను అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంస్థలోని మహిళపై వేధింపులు..

మసాజ్‌ చేయాలంటూ అసభ్యకర ప్రవర్తన

సహకరించాలంటూ బాధితురాలిపై పనిమనిషి ఒత్తిడి

స్టింగ్‌ ఆపరేషన్‌తో పోలీసులకు పట్టిచ్చిన మహిళ

సాక్షి, హైదరాబాద్‌
ఆధ్యాత్మిక, దేశభక్తి, మహిళల భద్రత.. ఇలా ఎన్నో అంశాలపై గజల్స్‌ రాసి ఆలపిస్తున్న కేసిరాజు శ్రీనివాస్‌ అలియాస్‌ గజల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంస్థలోని ఉద్యోగినినే వేధించి అడ్డంగా బుక్కయ్యాడు. బాధితురాలు పక్కా సాక్ష్యాలతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం బయటపడింది. ఈ కేసులో పార్వతి అనే మహిళను కూడా నిందితురాలిగా చేర్చినట్టు ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రవీందర్‌ మంగళవారం వెల్లడించారు. నాంపల్లి కోర్టులో నిందితుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లు బుధవారానికి వాయిదా పడ్డాయి. దీంతో గజల్‌ శ్రీనివాస్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఆఫీసులో మసాజ్‌ చేయాలంటూ.. :
పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన బాధిత మహిళ బీకాం, బ్యూటీషియన్‌ కోర్సులు పూర్తి చేయడంతో పాటు ప్రవచనాలు, వేదాలు అధ్యయనం చేసింది. ఈమెకు 2014లో వివాహమైనా మూడు నెలలకే విడాకులు తీసుకుంది. గతేడాది జూన్‌ నుంచి పంజగుట్ట పరిధిలోని సప్తగిరి బిల్డింగ్‌లో ఉన్న సేవ్‌ టెంపుల్‌ సంస్థలో నెలకు రూ.13 వేల జీతానికి పని చేస్తోంది. ఆ సంస్థ నిర్వహించే వెబ్‌ రేడియో ఆలయవాణికి ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వర్తిస్తోంది. వెలగపూడి ప్రకాశ్‌రావు నేతృత్వంలోని ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మూడేళ్లుగా సప్తగిరి బిల్డింగ్‌లోని త్రిబుల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌లో నడుస్తోంది. ఈ సంస్థకు గజల్‌ శ్రీనివాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి బాధితురాలు ఈ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకే విధులు నిర్వర్తించాల్సి ఉంది. అయితే గజల్‌ శ్రీనివాస్‌ తరచూ ఆ కార్యాలయానికి వెళ్లి అర్ధరాత్రి వరకు గడిపేవాడు. బాధితురాలిని కూడా ఆ సమయం వరకు ఉండాల్సిందిగా ఒత్తిడి చేసేవాడు.

ఇందుకు ఆమె గతంలోనే అనేకసార్లు సున్నితంగా తిరస్కరించింది. సేవ్‌ టెంపుల్‌ సంస్థలో బాధితురాలితో పాటు వీడియో ఎడిటర్, సహాయకుడు, పని మనిషి పార్వతి మాత్రమే ఉద్యోగులుగా ఉన్నారు. కార్యాలయానికి సంబంధించిన మూడు బెడ్‌రూమ్స్‌లో ఒకదాన్ని గజల్‌ శ్రీనివాస్‌ తన అనైతిక కార్యకలాపాలకు వినియోగించేవాడు. వేళకాని వేళల్లో పని మనిషి పార్వతితో కాళ్లు నొక్కించుకోవడం, మసాజ్‌ చేయించుకోవడంతోపాటు ఇతర అనైతిక కార్యకలాపాలకు పాల్పడేవాడు.

బెదిరింపులు.. వేధింపులు
పార్వతి మాదిరే తనకు ‘సహకరించాలంటూ’ శ్రీనివాస్‌ బాధితురాలిపై ఒత్తిడి చేసేవాడు. లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తానని, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడంతోపాటు మరెక్కడా ఉద్యోగం రాకుండా చేస్తానని బెదిరించేవాడు. పార్వతి సైతం గజల్‌ శ్రీనివాస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ బాధితురాలిపై అనేకసార్లు ఒత్తిడి తీసుకువచ్చింది. ‘‘నేను చేస్తున్నట్లే సార్‌కు చెయ్యి. అప్పుడే మంచి జీతంతో పాటు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తాడు. ఆయన చాలా పెద్దోడు. నాకు చేసినట్లే నీకు పెళ్లి కూడా చేస్తాడు’’ అని చెప్పేది. ఈ వేధింపులు తారస్థాయికి చేయడంతో అనేకసార్లు తిరస్కరించిన బాధితురాలు.. కొన్ని సందర్భాల్లో పార్వతితో కలిసి రెండుమూడు గంటల పాటు గజల్‌ శ్రీనివాస్‌ కాళ్లు నొక్కేది. దీంతో మరింత రెచ్చిపోయిన గజల్‌ శ్రీనివాస్‌ ఆ గదిలో నగ్నంగా/అర్ధనగ్నంగా ఉండి బాధితురాలిని పార్వతి ద్వారా పిలిపించేవాడు. ఆమెను బలవంతంగా ఆలింగనం చేసుకోవడం, చేతులతో అభ్యంతరకరంగా తడమటం చేసేవాడు. వీటిని భరించలేకపోయిన బాధితురాలు హెచ్చరిస్తే... బెదిరింపులకు దిగేవాడు. ఫోన్‌ ద్వారా, వాట్సాప్‌ చాటింగ్స్‌ ద్వారానూ హింసించేవాడు.

బాధితురాలి స్టింగ్‌ ఆపరేషన్‌
గజల్‌ శ్రీనివాస్‌ వేధింపులు శృతిమించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితురాలు భావించింది. అయితే పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, కేవలం ఫిర్యాదు మాత్రమే చేస్తే ఎవరూ నమ్మరనే ఉద్దేశంతో స్వయంగా స్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. సేవ్‌ టెంపుల్‌ కార్యాలయంలో శ్రీనివాస్‌ వినియోగిస్తున్న బెడ్‌రూమ్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో గజల్‌ శ్రీనివాస్, పార్వతి రాసలీలలతోపాటు పార్వతితో కలిసి బాధితులురాలు శ్రీనివాస్‌ కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా గత శుక్రవారం (డిసెంబర్‌ 29) పంజగుట్ట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. వీడియో రికార్డులతోపాటు వాయిస్‌ రికార్డులు, ఫొటోలు పోలీసులకు అందించింది. దీంతో ఐపీసీ 354, 354 (ఏ), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విషయం గోప్యంగా ఉంచి ప్రాథమిక దర్యాప్తు చేశారు. అన్ని ఆధారాలు సేకరించి మంగళవారం ఉదయం ఆనంద్‌నగర్‌ కాలనీలోని తన నివాసంలో గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.

ఠాణాలో టేబుల్‌పై దరువేస్తూ..
గజల్‌ శ్రీనివాస్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించి డాక్యుమెంటేషన్‌ పూర్తయ్యే వరకు దాదాపు రెండు గంటల పాటు ఠాణాలోని ఇంటర్వ్యూ రూమ్‌లో ఉంచారు. ఈ సమయంలోనూ ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు లేని గజల్‌ శ్రీనివాస్‌ అక్కడి టేబుల్‌పై దరువేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలను అక్కడున్న మీడియా ప్రతినిధులు రికార్డు చేశారు. అనంతరం గజల్‌ శ్రీనివాస్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే గజల్‌ శ్రీనివాస్‌ పలుకుబడి ఉన్న వ్యక్తని, బెయిల్‌పై బయటకు వస్తే కేసులో ఫిర్యాదిగా ఉన్న బాధితురాలిని బెదిరించడం, సేవ్‌ టెంపుల్‌ సంస్థ కార్యాలయంలో ఉన్న సీసీకెమెరా ఫుటేజ్‌లతోపాటు ఇతర సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన్ను రెండు వారాల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రెండు పిటిషన్లపై వాదనలను విన్న న్యాయస్థానం.. శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో పార్వతిని రెండో నిందితురాలిగా చేర్చామని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

కేసును తీవ్రంగా పరిగణిస్తాం: ఏసీపీ విజయ్‌కుమార్‌  
లైంగిక వేధింపుల కేసును తీవ్రంగా పరిగణిస్తామని పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్‌ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వారి కార్యాలయంలో కూడా విచారించి, వీడియోలు, ఆడియోలు, ఫోటోలు అన్ని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏ–1గా శ్రీనివాస్, ఏ–2గా పనిమనిషి పార్వతిని చేర్చినట్లు తెలిపారు. శ్రీనివాస్‌ గత రెండ్రోజులుగా నగరంలో లేడని, మంగళవారం ఉదయం వచ్చినట్టు తెలియగానే అరెస్టు చేసినట్లు తెలిపారు.

వద్దన్నా ఫిజియోథెరపీ చేసింది
ఆమెను (బాధితురాలు) నేను ఓ కుమార్తెలా చూసుకున్నా. గతంలో జరిగిన ఓ యాక్సిడెంట్‌లో నా చేతికి గాయమైంది. వైద్యుల సలహా మేరకు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా. ఆ రోజు ఫిజియోథెరపిస్ట్‌ రాలేదు. దీంతో తనకు అనుభవం ఉందని, తానే చేస్తానంటూ ఆమె ముందుకు వచ్చింది. నేను వద్దని వారించినా ఫిజియో«థెరపీ చేసింది. ఇప్పుడు ఇలా ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదు.
– మీడియాతో గజల్‌ శ్రీనివాస్‌

పచ్చి మోసగాడు..
గజల్‌ శ్రీనివాస్‌ పెద్ద మనిషి ముసుగు వేసుకుని ఉన్న పచ్చి మోసగాడు. ఆయన లైంగిక వేధింపులను పలుమార్లు సంస్థ నిర్వాహకులతో పాటు ఆయన కుటుంబ సభ్యుల దృష్టికి కూడా తీసుకువెళ్లా. వారెవరూ పట్టించుకోకపోవడంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశా. శ్రీనివాస్‌ కోరినట్లు ఉండాలంటూ పార్వతి నాపై అనేకసార్లు ఒత్తిడి చేసింది. ఆమె కూడా మంచిది కాదు. రెండు నెలలుగా నాపై వేధింపులు పెరిగాయి.
– మీడియాతో బాధితురాలు

మరిన్ని వార్తలు