ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగి

19 Apr, 2019 07:28 IST|Sakshi
ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ మోహీనుద్దీన్‌

రూ.6,200 లంచం తీసుకుంటూ  

ఏసీబీకి చిక్కిన ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌

యాకుత్‌పురా: ఆస్తిపన్ను మ్యూటేషన్‌ కొరకు రూ.6,200 లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ సర్కిల్‌–9 ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ మోహీనుద్దీన్‌ను గురువారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సంతోష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ రహమాన్‌ సర్కిల్‌–9 పరిధిలోని ఆలిజాకోట్ల ప్రాంతంలో 129 గజాల ఇంటిని 1992లో కొనుగోలు చేశాడు.

అనంతరం సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఇటీవల నగరానికి తిరిగివచ్చిన అతను ఇంటి ఆస్తిపన్నును మ్యూటేషన్‌ చేయించుకోవడానికి గత ఏడాది జూన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. మ్యూటేషన్‌ చేయడానికి రూ.6 వేల, అఫిడవిట్‌ నిమిత్తం రూ.200 ఇవ్వాలని ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ మోహీనుద్దీన్‌ డిమాండ్‌ చేశాడు. దీంతో  అబ్దుల్‌ రహమాన్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనమేరకు గురువారం సర్ధార్‌ మహల్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో రహమాన్‌ మోహినుద్ధీన్‌కు లంచం ఇస్తుండగా దాడి చేసి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని  అరెస్ట్‌ చేశారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు వెంకటేశ్వర్‌ రావు, రవీందర్‌ రెడ్డి, రాజేశ్, రాఘవేందర్, సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు